ఎమ్మెల్యే అంటే చెట్టు మీద కూర్చుండే వారు కాదు..

పదవులు ఉన్నా లేకున్నా మొదటి నుండి తాను విద్యకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పేర్కొన్నారు.

Update: 2024-08-29 14:58 GMT

దిశ,తుంగతుర్తి: పదవులు ఉన్నా లేకున్నా మొదటి నుండి తాను విద్యకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పేర్కొన్నారు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ ప్రాథమిక పాఠశాలలో దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో పానుగంటి సుమతీదేవి స్మారకార్థం రెండు రోజులపాటు జరిగే మండల స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బోయిని లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 1994 నుండి ప్రతి ఏటా ఎంతోమంది పిల్లల చదువుకు తాను వివిధ రకాలుగా దోహదపడుతున్నానని వివరించారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా అందుకున్న తొలి జీతాన్ని కూడా విద్యకే ఖర్చు పెట్టానని గుర్తు చేశారు. విద్య ఉన్నచోటనే నాగరికత, సంస్కృతి ఉంటుందని పేర్కొంటూ వెంపటి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. వెంపటి బిడ్డ, గడ్డకు వందనం అంటూ చేతులెత్తి నమస్కరించారు.

నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తే తాను పూర్తిస్థాయి బాధ్యత వహిస్తానని వివరించారు. ఈ మేరకు దీనికి ప్రణాళిక రూపొందించాలని పీఈటీలకు సూచించారు. గత ఫాసిస్ట్ పాలనలో విద్యా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వచ్చిన ప్రజా పాలనలో విద్యకు తొలి ప్రాధాన్యత లభించిందన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే చెట్టు మీద కూర్చుంటే కుదరదని, ప్రజల మధ్యనే తానుండే మనిషినని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తుంగతుర్తి నియోజకవర్గ సమస్యలపైన చర్చించడంతోపాటు మంత్రి సీతక్క, ఇతర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించానని వివరించారు. త్వరలోనే తుంగతుర్తిలో ఐటిఐ, వెలుగుపల్లి వద్ద పారిశ్రామిక వ్యవస్థ, నూతనకల్-మద్దిరాల మండలాలకు కలిపి ప్రభుత్వ జూనియర్ కళాశాల, తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కానున్నాయని వివరించారు. సమావేశంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు దాయం విక్రమ్ రెడ్డి, నల్లు రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, వెంకట రామ నర్సమ్మ, క్రీడల ఆర్గనైజర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. 


Similar News