నియోజకవర్గ అభివృద్ధి పై అసెంబ్లీలో ఎమ్మెల్యే భగత్ గళం..
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ నియోజకవర్గ సమస్యలపై తన గళాన్ని వినిపించారు.
దిశ, హాలియ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ నియోజకవర్గ సమస్యలపై తన గళాన్ని వినిపించారు. నియోజకవర్గంలోని త్రిపురారం మండల పరిధి కంపసాగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికి హెల్త్ ప్రొఫైల్ చూసుకుంటూ విద్యార్థులకు సమతుల్యమైన పోషకాలు అందేలా చూడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు కరోనా అనంతరం వివిధ కారణాలతో రద్దు చేయబడిన ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కోరారు.
నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబంధించిన రెవిన్యూ గ్రామాలను ఏఏ మండలాలలోని గ్రామాలను ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోనికి మార్చాలని మంత్రి మహమూద్ అలీని కోరారు. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ కు గత ఏడాది మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ బుద్ధ భవనంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమలకు రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎమ్మెల్యే కోరారు.