యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి.. అధ్యయనోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం

భక్తజన బాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ

Update: 2025-01-10 06:41 GMT

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భక్తజన బాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుడు వైకుంఠనాథుడిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.28 గంటలకు నరసింహస్వామి అలంకారంలో ఉత్తర ద్వారం గుండా గరుడ వాహనంపై భూదేవి, శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చారు.

ఉత్తర ద్వార దర్శనం..

జయ జయ ధ్వానాలు, నారసింహ నామస్మరణ, వేద పండితుల పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుడు ప్రధానాలయ ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై లక్ష్మీనృసింహుడు, పరమ భక్తాగ్రేసరులు ఆళ్వారాచార్యుల సేవకు అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వార దర్శన విశిష్టతను అర్చకులు వివరించారు. శ్రీ వైష్ణవ ఆలయాల్లో స్వామి వారి ఉత్తరద్వార దర్శనం సంప్రదాయం. అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉత్తర ద్వారం చెంత స్వామివారి దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని తిరు వీధుల్లో ఊరేగించారు.


అధ్యయనోత్సవాలకు శ్రీకారం..

యాదగీరిశుడి సన్నిధిలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మండపంలో వేదమంత్ర పఠనాలతో ఉత్సవమూర్తులకు, నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనాలు నిర్వహించారు. అలంకార సేవ, నమ్మాళ్వార్‌ సేవలను ఊరేగించారు. లక్ష్మీనారసింహుడిని సాయంత్రం వేళ మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న అధ్యయనోత్సవాల్లో స్వామివారి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.


Similar News