అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి

ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డులకు రోడ్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం,చెరువులను కృష్ణ జలాలతో నింపడమే తన ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-10-03 13:48 GMT

దిశ,నల్లగొండ: ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డులకు రోడ్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం,చెరువులను కృష్ణ జలాలతో నింపడమే తన ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కోటి రూపాయల వ్యయంతో చంద్రగిరి విల్లా నుంచి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మటన్ మార్కెట్ ను ప్రారంభించారు. ఏఆర్ నగర్ లో మస్రంపల్లి రోడ్డు నుంచి ఏఆర్ నగర్ వరకు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నల్గొండ పట్టణంలో 500 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి, మురికి కాలువల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లాయిగూడెం పిట్లంపల్లి వరకు సిసి రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచామని ,నెల రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. చంద్రగిరి విల్లా రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి దసరాలోపు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని,పనులు నాణ్యతగా ఉండాలని మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. చంద్రగిరి విల్లాలో తాగునీటి సమస్యను తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో తాగునీటి పైప్లైన్లను మార్చి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు 400 కోట్ల రూపాయలతో పట్టణంలో 11 లక్షల తాగునీటి సామర్థ్యం ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నామన్నారు. దీంతో ప్రతి ఇంటికి తాగునీరు వస్తుందన్నారు. మహాత్మ గాంధీ యూనివర్సిటీ పక్కన 25 కోట్ల రూపాయల వ్యయంతో హరిత హోటల్ ను టూరిజం శాఖతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.


Similar News