కేంద్రంలో బీజేపీ పాలనకు అంతిమ ఘడియలు : మంత్రి జగదీశ్వర్ రెడ్డి
దేశంలో గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పాలన పై అన్నివర్గాల ప్రజలు తీవ్రఅసంతృప్తితో ఉన్నారని మోడీ పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
దిశ, చిట్యాల : దేశంలో గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పాలన పై అన్నివర్గాల ప్రజలు తీవ్రఅసంతృప్తితో ఉన్నారని మోడీ పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలకు ఆయన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులు వెండితో చేయించిన 108 తమలపాకుల హారాన్ని హనుమంతుని విగ్రహానికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తొమ్మిది రాష్ట్రాలలో ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే కర్ణాటకలో ప్రజలు మరోసారి అలాంటి అవకాశం బీజేపీకి ఇవ్వకుండా కర్రు కాల్చి వాత పెట్టే ధోరణిలో తీర్పునిచ్చారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితిలో ఉందని, ప్రజలు అధికారం అప్పగించిన నిలబెట్టుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా హాజరయ్యారు.