Sanitation : మురుగు పారేదెలా..?
ఇప్పటికే అరకొర వసతులతో పలు అవస్థలు ఎదుర్కొంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు పారిశుద్ధ్య సమస్య నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.
దిశ, చిలుకూరు : ఇప్పటికే అరకొర వసతులతో పలు అవస్థలు ఎదుర్కొంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు పారిశుద్ధ్య సమస్య నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. మండలంలోని ఆర్లెగూడెంలో సంవత్సరంన్నర క్రితం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేశారు. ఇప్పటికీ వసతుల లేమితోనే ఆ ఇళ్లలో వారు కాలం వెళ్లదీస్తున్నారు. 'పులి మీద పుట్రలా వారిని పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. ఆవాస ప్రాంతంలో డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. ఇళ్లలో వినియోగించిన నీరు ఆ కాలువల్లోకి వెళుతోంది.
కాని ఆ నీటిని బయటకు వెళ్లే ఏర్పాటు చేయలేదు అధికారులు. దాంతో నీరంతా డ్రైనేజీల్లోనే నిలిచిపోతోంది. కాలువల్లో నిండిన నీరు తిరిగి ఇళ్ల ప్రాంతంలోనే నిలుస్తోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయేమోనని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా డ్రైనేజీలు శుభ్రం చేయడానికి రావడం లేదని అంటున్నారు. పైగా గ్రామంలోని చెత్తనంతా ఇళ్ల సమీపంలోనే వేస్తుండడంతో అపరిశుభ్రత నెలకొంది. ఈ పచ్చదనం - పరిశుభ్రత కార్యక్రమంలోనైనా తమ సమస్య పరిష్కరించాలని మండల అధికారులను కోరుతున్నారు.
దోమలతో భరించలేకున్నాం..
మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుండడంతో దోమలు పెరుగుతున్నాయి. దుర్వాసన వస్తోంది. జ్వరాలు వస్తాయేమోనని భయమేస్తోందంటున్నారు.