ఆ ఊరికి బస్సు ఉంది..కానీ లేదు..ఏం జరిగిందో మీరే చూడండి

సార్ మా ఊరికి బస్సు వేయండి...! అని గగ్గోలు పెట్టిన ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సూర్యాపేటకు డిపో మాత్రం ఎప్పటినుండో మీ ఊరికి బస్సు నడిపిస్తుంటే మళ్లీ అడుగుతారేంది...? అని అంటోంది

Update: 2024-11-18 10:22 GMT

దిశ,తుంగతుర్తి: సార్ మా ఊరికి బస్సు వేయండి...! అని గగ్గోలు పెట్టిన ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సూర్యాపేటకు డిపో మాత్రం ఎప్పటినుండో మీ ఊరికి బస్సు నడిపిస్తుంటే మళ్లీ అడుగుతారేంది...? అని అంటోంది. అరే..సార్ మా ఊరికి ఏ బస్సు రావడం లేదు...! మరి వీరేమో బస్సు వేశామంటున్నారు..!! ఏంది..? ఈ విచిత్రం. ఆ బస్సు మా గ్రామస్తులకు తెలియకుండా వచ్చి అదృశ్యమై వెళుతుందా...? అనేది గ్రామస్తుల మాట

అయితే ఇలా ప్రశ్నించే వారంతా టిఎస్ ఆర్టీసీ  రూపొందించిన “గమ్యం” యాప్ కు వెళ్దాం పదండి. మీ ఊరికి బస్సు ఉందో...? లేదో...? మీకే తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే..సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మానాపురం గ్రామానికి టైం ప్రకారంగా బస్సు నడుపుతున్నట్లు “గమ్యం” యాప్ లో అధికారులు రికార్డ్ చేశారు. ఆ బస్సు ఎన్ని గంటలకు వెళ్తుందో చూద్దాం....! ఉదయం 9:30 గంటలకు మానాపురం గ్రామం నుంచి బయలుదేరి సూర్యాపేటకు 11:15 గంటలకు చేరుతుంది. ఈ దూరం మధ్య 25 స్టాపులు ఉన్నట్లు కూడా అందులో అధికారులు పొందుపరిచారు. ఇక వాస్తవంలోకి అడుగుపెడితే..ఆ ఊరికి నేడు బస్సే లేదు.పైగా గ్రామానికి బస్సు రద్దు చేసి నెలలు గడుస్తోంది. ఇదిలా ఉంటే “గమ్యం”లో మరో బస్ కథ విచిత్రంగా నమోదయింది. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన సర్వీసు బస్సు గతంలో మహబూబాబాద్ జిల్లా దాట్ల, మరిపెడ బంగ్లా వరకు నడుస్తుండేది. అయితే చాలా కాలం క్రితమే పలు కారణాలతో ఈ సర్వీసును రద్దు చేసి..మద్దిరాల మండల కేంద్రం వరకు కుదించి నడిపిస్తున్నారు. అయితే “గమ్యం” యాప్ లో మాత్రం దాట్ల గ్రామం నుండే బస్సు నడిపిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక సూర్యాపేట నుంచి ఉదయం 6:30 గంటలకు,మరొకటి 6:45 గంటలకు తుంగతుర్తి మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకే సర్వీసులను నడిపిస్తున్నట్లు గమ్యంలో చూపెట్టారు. కానీ ఇందులో ఒక బస్సు సికింద్రాబాద్ వరకు నడుస్తోంది. అయితే “గమ్యం” యాప్ ద్వారా బస్సు సర్వీసుల వివరాలు తెలుసుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అసలు బస్సులు ఎప్పుడెప్పుడు నడుస్తున్నాయో..? ఏ ఊరికి ఏ బస్సు ఉందో...? తెలియని పరిస్థితుల్లో వారంతా కొట్టుమిట్టాడుతున్నారు.


Similar News