అంధకారంలో లేబర్ కార్యాలయం
గత పది రోజుల నుంచి కోదాడ పట్టణంలోని లేబర్ కార్యాలయం అంధకారంలో ఉంది.
దిశ,కోదాడ : గత పది రోజుల నుంచి కోదాడ పట్టణంలోని లేబర్ కార్యాలయం అంధకారంలో ఉంది. విద్యుత్ బకాయి బిల్లు చెల్లించకపోవడంతో.. విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో చీకటి గదిలోనే ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి..వెళ్లేవారు సైతం విద్యుత్ లేకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. అలాగే చాలా పనులు పూర్తికాక వెను తిరుగుతున్నారు. ప్రస్తుతం అంతా డిజిటలైజేషన్ కావడంతో..ప్రతిదీ ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంది. కానీ అధికారులు పవర్ లేదని పని దాటవేస్తున్నారు. బకాయి చెల్లించవలసిన బిల్లు ఎంత అని చూస్తే..కేవలం 1410 రూపాయలకు ప్రభుత్వ కార్యాలయంలోనే కరెంటు కట్ చేసిన తీరును చూస్తుంటే విద్యుత్ అధికారుల నిజాయితీ కనిపిస్తుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.