నయీం భూములకు క్లియరెన్స్ వచ్చినట్లేనా..?

సామాన్యులు తమ పొట్టకూటి కోసం ప్రభుత్వ భూమిలో ఎన్నో ఏళ్లుగా

Update: 2025-03-21 01:47 GMT
నయీం భూములకు  క్లియరెన్స్ వచ్చినట్లేనా..?
  • whatsapp icon

దిశ,చౌటుప్పల్: సామాన్యులు తమ పొట్టకూటి కోసం ప్రభుత్వ భూమిలో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న విషయం తెలిసిన వెంటనే అధికారులు నిర్దాక్షిణ్యంగా వారిపై చర్యలకు పూనుకుంటారు. కానీ రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక లాభార్జన కోసం ప్రభుత్వ భూములను చెరబట్టిన చర్యలు తీసుకునేందుకు మాత్రం జంకుతుంటారు. నయీమ్ భూములను గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించిన ప్రస్తుత ప్రభుత్వం అవే భూములు ఓ ప్రైవేట్ వెంచర్ యాజమాన్యం చేరబట్టేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకొని రావడం లేదో అర్థం కావడం లేదు.

56 ఎకరాలు నయీం భూములు..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 12 లో 45 ఎకరాల 35 గుంటల సిట్ కేసు (నయీం) పరిధిలో ఉండడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. అదేవిధంగా సర్వేనెంబర్ 13, 14 లలో పది ఎకరాల 10 గుంటల భూమి నయీమ్ కు సంబంధించి సిట్ పరిధిలోనే ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 17 లో 10 ఎకరాల 11 గుంటలు,సర్వే నంబర్ 18లో 16 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ, నయీం భూమి మొత్తం కలిపి 83 ఎకరాలు ఉన్నది. అయితే ఇటీవల విజయ్ జేబీ ఇన్ ర్భా (టెర్ర గ్రీన్ హిల్స్) తూప్రాన్ పేట రెవెన్యూ లోని సర్వే నంబర్ 12/P,13,14,17/P,18/P,19/Pలలో 222 ఎకరాలలో మెగా లే అవుట్ ను ఏర్పాటు చేస్తున్నామని భారీగా ప్రకటనలు ఇస్తూ లే అవుట్ కాపీలతో అమ్మకాలను మొదలుపెట్టింది. అయితే సదరు వెంచర్ యజమాన్యం చూపిస్తున్న సర్వే నంబర్లలో పూర్తి విస్తీర్ణం ఆర్ఎస్ఆర్ ప్రకారం 241ఎకరాలు కాగా అందులో ప్రభుత్వ,నయీం భూములు 83 ఎకరాలు ఉంది. అయితే విజయ్ జేబీ ఇన్ఫ్రా యాజమాన్యం చూయిస్తున్న 222 ఎకరాల లే అవుట్ ఎలా సాధ్యం అవుతుంది అనేది అర్థం కావడం లేదు. అంటే సదరు వెంచర్ యాజమాన్యం నయీం,ప్రభుత్వ భూమిని కూడా చూపించి అమ్మకాలు చేస్తుందనేది ఇట్లాగే తెలిసిపోతుంది.

క్లియరెన్స్ వచ్చిందా..?

రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నయీమ్ కేసు సంచలనం సృష్టించింది. నయీమ్ మరణించిన తర్వాత విచారణలో వేల ఎకరాల భూములు ఆయన పేరుపై ఉన్నట్లు తేలింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు అప్పగించి విచారణను చేసింది. అయితే సిట్ విచారణలో తేలిన నయీమ్ భూములను అన్నింటినీ నిషేధిత జాబితాలోనే చేర్చారు. అందులో భాగంగానే తూఫ్రాన్ పెట్ రెవెన్యూ పరిధిలో సుమారు 56 కరాల భూములను కూడా నిషేధిత జాబితాలో చేరుస్తూ 2019లో తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపు శాఖ కమిషనర్ కార్యాలయం ఓ లెటర్ ను అన్ని జిల్లాలకు పంపించి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయించింది. సదరు లెటర్ ను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో పొందుపరిచి నిషేధిత జాబితాలో కూడా చేర్చారు. నిషేధిత జాబితాలోనే సదరు భూములు ఉండడంతో విజయ్ జేబీ ఇన్ ర్భా యజమాన్యం చేపడుతున్న వెంచర్లో నయీం భూములు కూడా ఉన్నాయనేది తెలిసిపోతుంది. ఒకవేళ నయీం భూములకు క్లియరెన్స్ వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో సదరు భూమిని నిషేధిత జాబితాలో నుంచి ఎందుకు తొలగించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.

విచారణ పేరుతో కాలయాపన..

నయీం భూములకు క్లియరెన్స్ వచ్చేంతవరకు ప్రభుత్వ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వ సర్వే నంబర్లను చూయిస్తూ సదరు వెంచర్ యాజమాన్యం అమ్మకాలు ప్రారంభించడంతో ప్రభుత్వ భూమిలో ఉన్న లావుని పట్టా రైతులకు నోటీసులు జారీ చేసి వివరణ అడుగుతున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసలు ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా గ్రామ పంచాయతీకి ఇవ్వవలసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా వెంచర్ యజమాని అమ్మకాలు ప్రారంభించిన పంచాయతీరాజ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సదర్ వెంచర్ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయిన అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏమిటో తెలియడం లేదు. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు పాటించని సదరు వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని కొనుగోలుదారులకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

సర్వే నంబర్ 12 లో కొందరు కోర్టుకు వెళ్లారు : హరికృష్ణ,తహశీల్దార్ చౌటుప్పల్

తూప్రాన్ పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 12 లో ఉన్న నయీమ్ భూముల కేసులో కొందరు కోర్టుకు వెళ్లారు. సర్వే నెంబర్ 12 లో ఇప్పటివరకు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇంకా నిషేధిత జాబితాలోనే ఉన్నాయి.

Similar News