నల్లగొండ జిల్లాలో భారీ స్కామ్
ప్రతి గ్రామం ప్రగతిపథంలో నడవాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనే పోస్టును సృష్టించారు. గ్రామాలలో అభివృద్ధికి వీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధి లాగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని 2018 లో ఈ కార్యదర్శి వ్యవస్థ వచ్చింది.

దిశ, నల్లగొండ: ప్రతి గ్రామం ప్రగతిపథంలో నడవాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనే పోస్టును సృష్టించారు. గ్రామాలలో అభివృద్ధికి వీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధి లాగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని 2018 లో ఈ కార్యదర్శి వ్యవస్థ వచ్చింది. కానీ నల్లగొండలో అనుకున్నది ఒక్కటి అవుతున్నది ఒక్కటి అన్న చందంగా మారింది. నల్లగొండలో మొత్తం 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు 868 మంది ఉన్నారు. గడిచిన ఏడాది కాలంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఇంటి పన్నులు,వ్యాపార సంస్థలు పన్నులు,ఫంక్షన్ హాల్స్ పన్నులు,పెట్రోల్ పంపుల పన్నులు,వెంచర్ల పన్నులు,హౌస్ రిజిస్ట్రేషన్ పన్నులు వసూలు చేసి అవి గ్రామ పంచాయతీ అకౌంట్లో జమ చేయాలి. కానీ నల్లగొండలో మాత్రం దీనికి అంతా విరుద్ధంగా జరుగుతుంది. పన్నుల చలాన్లు కట్టకుండా వారి సొంతానికి లక్షల రూపాయలు వాడుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పన్నులు చెల్లించిన 48 గంటల్లో డబ్బులు గ్రామ పంచాయతీ బ్యాంకు అకౌంట్లో వేయాలి కానీ వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నట్లు సమాచారం. ఆన్లైన్‌లో రికార్డులో ఒక లెక్క ఆఫ్ లైన్‌లో ఒక లెక్క దీని మర్మం ఏంటి అంటే అధికారులు లెక్కలు తీసిన కానీ ఆన్ లైన్ లో మాత్రమే నివేదికలు చూస్తారు ఆఫ్ లైన్ లో చూడరు. ఆఫ్ లైన్ రిపోర్టు చూసేది ఆడిట్ వాళ్ళు మాత్రమే కావున వారికి చేయాల్సింది చేసి మామా అనిపిస్తారు. అది ఆసరాగా చేసుకుని చేతికి అందిన కాడికి దోచుకుంటున్నారు. పంచాయతీలలో పాలన వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ వ్యవస్థ గాడి తప్పినట్లు తెలుస్తుంది. స్పెషల్ అధికారుల పర్యవేక్షణలో వారికి పూర్తి అవగాహన లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు కాలం వెళ్లదీస్తూ.. చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సీపీఆర్ కమిషన్ ఆఫ్ పంచాయతీరాజ్ వారికి ఈ లెక్కలు పంపాలి. గుర్రంపోడు, అనుమల, కనగల్, కట్టంగూరు, మిర్యాలగూడ డివిజన్, దేవరకొండ డివిజన్‌లో పన్నులు మింగుడు భారీగా జరిగినట్లు తెలుస్తుంది.
కలెక్టర్ రూ. 5 కోట్ల 10 లక్షలు ఇచ్చినా సరిపోలే..
నల్లగొండ జిల్లాలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను గ్రామ పంచాయతీలలో తాగునీటి బోర్లు,చేతి పంపులు,పైపు లైన్లు,తాగునీటి ట్యాంక్ ల మరమ్మతులకు డిఎంఎఫ్టీ నిధుల నుంచి సుమారు ఐదు కోట్ల 10 లక్షల రూపాయలు విడుదల చేశారు. అయిన పంచాయతీ కార్యదర్శులు బోరు బావుల మరమ్మత్తుకు లక్షలు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నట్లు సమాచారం. పై స్థాయి అధికారులు అనుమతి లేకుండా వాడుకోవడం వెనుక పెద్ద తతంగం జరిగినట్లు తెలుస్తుంది.
మొత్తం తప్పుడు లెక్కలు
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 31వ తేదీ వరకు ఇంటి పన్నులు 100% కట్టించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వారు ఆదేశించింది. అయితే ఇదే అదును చేసుకున్నటువంటి నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు 868 గ్రామాలలో ఇంటి పన్ను వసూలు చేశారు. రికార్డులో 20 నుంచి 30 శాతంకే చూయిస్తున్నారు కానీ ఆన్లైన్ లో మాత్రం అంతా తప్పుడు నివేదికతో ఒక్కో గ్రామం ,మండలము సుమారు 80% నుంచి 90% మధ్యలో ఇంటి పనులను కట్టినట్లు 86% జిల్లావ్యాప్తంగా ఇంటి పనులను వసూలు చేసినట్లు ఆన్లైన్ రిపోర్టులలో చూయించినట్లు తెలుస్తుంది.
ఆన్లైన్ లో మండలాల వారీగా చూపిస్తున్న లెక్కలు
ఇంటి పనుల్లో వసూళ్లలో జిల్లాలోని 33 మండలాల వారిగా ఆన్లైన్ లో రిపోర్టు చందంపేట 30 గ్రామపంచాయతీలు 84%, గట్టుప్పల్ ఏడు గ్రామపంచాయతీలు 82%, మాడుగుల పల్లి 28 గ్రామాలు 100% పైగా ,నల్లగొండ లో 31 గ్రామ పంచాయతీలకు గాను 95%, శాలిగౌరారం 24 గ్రామ పంచాయతీలకు గాను 85%, అడవిదేవులపల్లి లో 13 గ్రామాలకు గాను 92 శాతం, నాంపల్లి మండలంలో 32 గ్రామపంచాయతీలకు గాను 84%, కనగల్ మండలం లో 31 గ్రామాలకు 89%, కేతేపల్లి మండలంలో 16 గ్రామాలకు గాను 86%, తిరుమలగిరి సాగర్ మండలంలో 35 గ్రామాలకు గాను 90% ,గుడిపల్లి మండలం లో 12 గ్రామ పంచాయతీల గాను 91%, కొండమల్లేపల్లి మండలానికి 27 గ్రామ పంచాయతీల గాను 75%, నార్కట్పల్లి మండలం లో 29 గ్రామపంచాయతీలో గాను 77%, దేవరకొండ మండలంలో 41 గ్రామ పంచాయతీలకు గాను 84%, మునుగోడు మండలానికి 28 గ్రామాలకు 86%, గుండ్లపల్లి మండలానికి గాను 39 గ్రామ పంచాయతీలకు 81 శాతం, అనుముల మండలానికి 23 గ్రామాలకు 76%, నకిరేకల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 75%, తిప్పర్తి మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను 83%, పెద్దవూర మండలంలో 28 గ్రామపంచాయతీలో గాను 85% ఉన్నాయి.
అలాగే నేరేడు బొమ్మ మండలం లో 21 గ్రామ పంచాయతీలకు గాను 84%, చింతపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీలకు 88%, మర్రిగూడ మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో 87%, పెద్దఅడిశర్లపల్లి మండలంలో 25 గ్రామపంచాయతీలో 92%, చండూరు మండలంలోని 18 గ్రామ పంచాయతీలో 78 శాతం, చిట్యాల మండలంలోని 18 గ్రామాలకు గాను 89%, గుర్రంపోడు మండలంలోని 38 గ్రామాలకు గాను 83%, త్రిపురారం మండలంలోని 32 గ్రామపంచాయతీలకు గాను 89%, కట్టంగూరు మండలంలోని 22 గ్రామాలకు 81%,వేములపల్లి మండలంలోని 12 గ్రామాలకు 93%, నిడమనూరు మండలంలోని 29 గ్రామాలకు గాను 85%, దామరచర్ల మండలంలోని 35 గ్రామాలకు 85%, మిర్యాలగూడలోని 46 గ్రామ పంచాయతీలకు గాను 90%, ఉన్నట్లు ఆన్లైన్ లో రిపోర్టు ఇచ్చారు. పూర్తిగా 86%, నల్గొండలో ఇంటి పన్నులు మరియు అన్ని పనులు వసూలు చేసినట్లు ఆన్లైన్ రికార్డులో ఎక్కించడం జరిగింది. కానీ ఆఫ్లైన్లో మాన్యువల్ గా రికార్డులలో మాత్రం ఇవన్నీ కూడా 40% నుంచి 50% మేరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా నేటికి ఆన్లైన్‌లో 19 కోట్ల 15 లక్షల 84677 వసూలు చేసినట్లు రిపోర్టును ఉంచడం జరిగింది. ఇంకా మూడు కోట్ల 11 లక్షల 57,245 రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్లైన్లో చుయించడం జరిగింది.ఈనెల చివరి వరకు ఆ మిగిలిన ఎమౌంట్ కూడా ఆన్లైన్ లో చూపించాలని అధికారులు ఆదేశాలు మౌఖికంగా తెలిపినట్లు సమాచారం. ఇక మాడుగుల పల్లి మండలం రిపోర్టు చూస్తే సిగ్గుపోతుంది 100% కి 101 % వసూలు చేసినట్లు ఆన్లైన్ రిపోర్టులో చూపిస్తుండ్రు.
రాష్ట్ర కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ శాఖ వద్దకు దొంగ రిపోర్టు
నల్లగొండలో జరిగిన కొట్ల రూపాయల పన్నుల వసూళ్ల స్కామ్ పంచాయతీ రాజ్ శాఖ పసిగట్టినట్టు తెలుస్తుంది. నల్లగొండలో ఒక్కో మండలంలో సుమారు 90%పన్నులు వసూలు చేసినట్లు ఆన్లైన్ లో చూపించడం తో వారికి అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది. మరి వారు ఇచ్చిన ఈ రిపోర్టు ప్రకారం వారు క్రాస్ చెక్ చేసుకున్నట్లు గ్రామ పంచాయతీ ట్రెజరీ లలో అసలు 40% నుండి 50% వరకు కూడా దిగువ లో డబ్బులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
తలలు పట్టుకుంటున్న పంచాయతీరాజ్ అధికారులు
పంచాయతీ కార్యదర్శులను మీరు చూపించిన ఆన్లైన్ రిపోర్టు మీ రికార్డులో ఆఫ్లైన్లో మాన్యువల్ గా ఉండాలని లేకుంటే మీ ఉద్యోగం మీద మీరు ఆశలు పోగొట్టుకోవాలి అని తెలుపుతున్నట్లు సమాచారం. అధికారులు చూసి చూడనట్లు ఉండటం వల్లనే ఎవరు సరిగా పని చేయకుండా అందిన కాడికి దోచుకుంటునట్లు తెలుస్తుంది.
ఇష్టారాజ్యంగా పంచాయతీ కార్యదర్శులు
పన్నుల రసీదు పుస్తకాలు పూర్తిగా క్రమపద్ధతిలో ఉండాలి..కానీ ఇది ఏమి ఉండదు. మండల పంచాయతీ అధికారి మొదటి పేజీ అలాగే చివరి పేజీ సంతకం తో రికార్డులలో రాసుకొని ఉండాలి. కానీ అలా ఏమీ ఉండదు. ఇష్టారాజ్యంగా కార్యదర్శుల చేతివాటం కొనసాగుతుంది. ఇదే ఆసరాగా చేసుకుని నల్లగొండలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ లో 50 పేజీలు అలాగే 100 పేజీల ఇంటి పన్ను రసీదు పుస్తకాలు పదుల సంఖ్యలో ప్రింట్ తీసుకొని వచ్చిన డబ్బులు సొంతానికి వాడుకుంటున్నారు అని ప్రజల్లో వినికిడి.
కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలవతనం చేస్తూ..
కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే స్థానిక ప్రజాప్రతినిధులు కాలపరిమితి ముగిసిన వెంటనే గ్రామాల్లో స్పెషల్ అధికారుల నియామకం ఉండటం స్పెషల్ అధికారులు వారి విధులు చేస్తూ ఈ బాధ్యత మీద అంతా దృష్టి పెట్టకుండా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడం వారికి వరంగా మారింది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. మంత్రులు అలాగే ముఖ్యమంత్రి కూడా జనరల్ ఫండ్ వాడుకొమ్మని ఆదేశాలు ఇస్తుంటే వీరు మాత్రం అందినకాడికి పక్క దారి పట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు వ్యతిరేకంగా అయ్యేలా డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని పలవతనం చేస్తున్నారు అనే బలమైన వాదన వినిపిస్తోంది.
చర్యలు ఉండేనా
ఇకనైనా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వారు ,జిల్లా పంచాయతీ రాజ్ శాఖ వారు మరి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు వీరు చేసినటువంటి స్కామ్ మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ డివిజన్,మిర్యాలగూడ డివిజన్ లో పెద్ద ఎత్తున ఈ పన్నుల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని దిశ వివరణ కోసం కార్యాలయానికి వెళ్తే అందుబాటులో లేరు పలుమార్లు కాల్ చేసిన అందుబాటులోకి రాలేదు.