మఠంపల్లి మండలంలో భారీ వర్షం.. ప్రమాదం అంచున వేమూలూరి ప్రాజెక్టు అలుగు

మండలంలో భారీ వర్షాల వల్ల పలుగ్రామాలలోకి నీరు చేరింది. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

Update: 2024-09-01 05:10 GMT

దిశ, మఠంపల్లి: మండలంలో భారీ వర్షాల వల్ల పలుగ్రామాలలోకి నీరు చేరింది. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మఠంపల్లి మామిళ్ళ చెరువుకు గండి పడటంతో ఆ నీరు స్థానిక ఎస్సీ కాలనీలో చేరడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. మఠంపల్లికి సమీపంలో రైల్వే కట్ట నిర్మించడంతో వర్షపు నీరు ఎస్సీ కాలనీ లోకి చేరింది. అదేవిధంగా రఘునాధపాలెం గ్రామం పక్కన ఉన్న ఊరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామంలోకి నీరు చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు తమ సేవలను అందించారు.

వర్షంలో ఆటోలో చిక్కుకున్న మహిళలను ఒడ్డుకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని యాతవాకిళ్ళ వద్ద ఉన్న వేమూలూరి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల అలుగు ఎప్పుడు తెగుతుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటగంటకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాగా స్థానికంగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు బాధ్యతారహితంగా గ్రామాల్లో లేకపోవడం పట్ల అధికారుల తీరు పై మండి పడుతున్నారు.


Similar News