పండగ పూట విషాదం.. ఏఎమ్మార్పి ప్రధాన కాలువలో తండ్రి కొడుకులు గల్లంతు !
ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో తండ్రి కొడుకు గల్లంతైన విషాద ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది.
దిశ, కనగల్లు : ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో తండ్రి కొడుకు గల్లంతైన విషాద ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులపురం గ్రామానికి చెందిన సూరవరం దామోదర్ (39) అతని కుమారుడు ఫనీంద్ర వర్మ అలియాస్ బిట్టు (14) స్నానం చేయడానికి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న ఏఎమ్మాఆర్పి ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలువలో ఈత కొడుతూ స్నానం చేస్తున్న సమయంలో మొదటగా ఫణీంద్ర వర్మ వరద తాకిడికి కాలువలో కొట్టుకుపోయాడు.
కొడుకును కాపాడేందుకు తండ్రి నీటి ప్రవాహంలోకి వెళ్ళగా వరద అధికంగా ఉండడంతో తండ్రి సైతం ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఇదే సమయంలో వారి బంధువులు సైతం కొందరు అక్కడే ఉన్నప్పటికీ కాలువ అధికంగా ప్రవహిస్తుండడంతో ఏమి చేయలేక నిస్సహాయులుగా నిలిచిపోయారు. స్థానికుల సమాచారంతో కనగల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఇద్దరి ఆచూకీ కనపడలేదు. కాగా దామోదర్ కుటుంబం కొంతకాలంగా నల్గొండ మండలం బుద్ధారం లో ఉంటున్నారు. దీపావళి పండుగ కావడంతో సొంతూరికి తండ్రి కొడుకు వచ్చారు. పండగపూట ఆ కుటుంబంలో విషాదం జరగడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.