శరవేగంగా సాగుతున్న పనులు…నీటి విడుదలకు క్రాస్ బండ్ల ఏర్పాటు

నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టకు కాగిత రామచంద్రాపురం గ్రామ సమీపంలోని 132 కిలో మీటరు ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన పడిన గండి పూడ్చే మరమ్మత్తు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Update: 2024-09-21 12:54 GMT

దిశ, నడిగూడెం: నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్టకు కాగిత రామచంద్రాపురం గ్రామ సమీపంలోని 132 కిలో మీటరు ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన పడిన గండి పూడ్చే మరమ్మత్తు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో మట్టి బ్యాంకింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కాల్వ కట్ట పూర్తి స్థాయి ఎత్తు 6.1 మీటర్లు కాగా శనివారం నాటికి 3.7 మీటర్ల ఎత్తు వరకు బ్యాంకింగ్ పనులు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో మట్టి బ్యాంకింగ్ వర్క్ పూర్తవగానే కట్టకు సపోర్ట్ గా శాండ్ బ్యాగ్ లు ఏర్పాటు చేయనున్నారు. శాండ్ బ్యాగ్ ల ఏర్పాటు ఆలస్యమవుతుందనే నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తగా హెచ్ డిపిఈ షీట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తొలిసారిగా ఏర్పాటు చేసే ఈ హెచ్ డిపిఈ షీట్ల ఏర్పాటు కు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని వారు తెలుపుతున్నారు. కాగా 132 కిలో మీటర్ వద్ద జరుగుతున్న ప్రాంతాన్ని సీఈ రమేష్ బాబుతో నిత్యం పరిశీస్తూ అధికారులకు పలు సూచనలు అందిస్తున్నారు. మట్టి బ్యాంకింగ్ పనులను ఈఈ రాంకిషోర్, ఏఈ సత్యనారాయణలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే 133.5 కిలో మీటరు పడిన గండి వద్ద తొలుత కాంక్రీటు వాల్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ వాల్ శనివారం నాటికి 2.5 మీటర్ల ఎత్తు వరకు చేరుకున్నాయి. కాంక్రీట్ పనులు పూర్తి కాగా నే మట్టి బ్యాంకింగ్ పనులు మొదలు పెట్టనున్నారు.

నీటి విడుదలకు క్రాస్ బండ్ల ఏర్పాటు..

ఆయకట్టు పరిధిలో సాగవుతున్న పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశ్యంతో మునగాల హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా 128.4 కిలో మీటర్ పాలారం మేజర్ వద్ద సుమారు 14 అడుగుల ఎత్తు ఆరు ఫీట్ల వెడల్పుతో క్రాస్ బండ్ ను ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం వల్ల క్రాస్ బండ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాండ్ బ్యాగ్లను సపోర్ట్ గా ఉంచనున్నారు. అక్కడి నుంచి దిగువకు నీటి సరఫరా కోసం క్రాస్ బండ్ లో పైపులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దిగువన సిరిపురం, కేఆర్సీపురం ప్రాంతాల్లో రైతుల సహకారంతో పనులు జరుగుతున్న ప్రదేశానికి నీరు రాకుండా ఉండేందుకు గాను మరికొన్ని చిన్న స్థాయిలో మట్టితో క్రాస్ బండ్లను ఏర్పాటు చేసి శాండ్ బ్యాగ్ లను ఉంచారు. మట్టి కట్టల ఏర్పాటుతో పంపు మోటర్ల ద్వారా పంటలను రక్షించుకునే అవకాశం కలిగించినట్లైంది. పూర్తి స్థాయి మరమ్మత్తు పనులు ఆలస్యమవుతున్న కారణంగానే పంటలను కాపాడాలనే ప్రత్యామ్నాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

నేడు మేజర్లకు సాగునీటి విడుదల... !

సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మొదటి జోన్ వరకు అధికారులు ఆదివారం ఉదయం మునగాల రెగ్యులేటర్ వద్ద నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో మొదటి జోన్ పరిధిలోని పాలవరం, కొత్తగూడెం, కొమరబండ మేజర్లకు నీటి సరఫరాను పునరుద్ధరించినట్లవుతుంది. నీటి విడుదల ఒకేసారి కాకుండా క్రమంగా పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం వరకు మరో మేజర్ అయిన ఈశ్వరమాధారానికి కూడా నీటి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Similar News