అంతా ఆగమాగం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పాలకవీడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లడంతో అంతా ఆగమాగం అయింది.
దిశ, నేరేడుచర్ల ( పాలకవీడు) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పాలకవీడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లడంతో అంతా ఆగమాగం అయింది. రహదారుల ధ్వంసమై విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడం తో పాటు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో పలు గ్రామాల్లో పంటలు నీట మునగడంతో అపార నష్టం వాటిల్లినట్టు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ -గోపాలపురం చెరువులు కట్టలు తెగిపోవడంతో ఆ వరద వేములేరు వాగులో ప్రవహించడంతో దాని ఉధృతి పెరిగి ఆ వాగు పక్కన ఉన్న ఇరువైపులా పంట పొలాలు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఇసుక మేటలు వేసి రాళ్లతో పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఆ వాగుపక్కనే వేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ మోటార్లు, విద్యుత్తు లైన్లు పూర్తిగా ధంసమయ్యాయి. మండల వ్యాప్తంగా 50 విద్యుత్ స్తంభాలు పడిపోగా, 10 విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లు నీట మునిగినట్లు, ఐదు కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు ధ్వంసం అయినట్లు తెలిసింది. దాంతో సుమారు 50 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు ట్రాన్స్ కో ఏఈ నరసింహ నాయక్ తెలిపారు. అలాగే వేములేరు వాగు పై వేసిన బ్రిడ్జి పూర్తిగా దెబ్బతీయడంతో మఠంపల్లి నుండి జాన్ పహాడ్ మీదుగా దామరచర్లకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వేములేరు వాగుపక్కన ఉన్న మీగడం పహాడ్ తండా శ్మశాన వాటిక పూర్తిగా దెబ్బతిన్నది. మండలంలోని శూన్య పహాడ్ బ్రిడ్జి వద్ద చెక్ డ్యాం నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద తాకిడికి చేపలు రావడంతో జాలర్లు చేపల వేట చేస్తున్నారు. అలాగే రాఘవపురం ప్రకృతి వనం కూడా వేములేరు వాగు పక్కనే ఉండడంతో నీటి తాకిడికి కొట్టుకుపోయింది. మహంకాళి గూడెం వద్ద కృష్ణా నది పుష్కరఘాటు నీటిలోనే మునిగి ఉంది.