కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు
దిశ,చౌటుప్పల్ : కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే..రమణి ఇండస్ట్రీని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ... పర్యావరణాన్ని పరీక్షించాలనే మంచి ఆలోచనతో పర్యావరణ రహిత క్యారీ బ్యాగులు తయారు చేసే రమణి ఇండస్ట్రీస్ నెలకొల్పడం సామాజిక బాధ్యతలో భాగమేనని అన్నారు. రమణి ఇండస్ట్రీస్ నిర్వాహకులు రమణి, ప్రసాద్ లు సమాజానికి ఉపయోగపడే పరిశ్రమలు స్థాపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పరిశ్రమను ఏర్పాటు చేశారని అన్నారు. రమణి ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న క్యారీ బ్యాగులు నీటిలో ఒక్కరోజు ,భూమిలో 90 నుంచి 180 రోజులలో కరిగిపోతాయని అదే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు 200 పైగా సంవత్సరాలు అయినా కూడా భూమిలో కరగవు అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని దృఢ సంకల్పంతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పాల్తిన్ క్యారీ బ్యాగ్స్ వల్ల భూమి, నీరు,గాలి కాలుష్యంగా మారాయని, కాలుష్యానికి హాని చేయకుండా ఉండే క్యారీ బ్యాగ్స్ ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన డి ఆర్ డి ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేసే క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమను స్థాపించిన రమణి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని అటువంటి వారికి తమ పూర్తి సహకారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కాలుష్యం ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్న తీరు మనసుని కలచి వేస్తుందని ఆవేదన చెందారు. పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని.. తమ వంతు పాటుపడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పరిశ్రమ నిర్వాహకులు మునుగోడు నియోజకవర్గ ప్లాస్టిక్ రహితంగా తయారయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పూర్తిగా పర్యావరణ క్యారీ బ్యాగుల అమ్మకాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి, డి ఆర్ డి ఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం,పరిశ్రమ నిర్వాహకులు రమణి, ప్రసాద్, విజేత సూపర్ మార్కెట్ అధినేత జగన్ మోహన్ రావు, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.