'ఉద్యమకారులను అణచివేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'.. బీఆర్ఎస్‌పై ఈటెల రాజేందర్ ఫైర్

Update: 2023-06-04 15:07 GMT

దిశ, భువనగిరి రూరల్: కవులు, కళాకారులు, మేధావులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు పిడికిలి బిగించి తెలంగాణ సాధించుకుంటే వారి ఆకాంక్షలను కేసీఆర్ మర్చిపోయి నియంత పాలన కొనసాగిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అలయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట కోట్లాది రూపాయలను వెచ్చించి బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారానికి అధికారులతో చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతు వేదికలో దావత్‌ల రూపంలో రైతులను మోసగిస్తున్నారని, తెలంగాణ సాధనలో ఆస్తులు ప్రాణాలు సర్వస్వము కోల్పోయిన ఉద్యమ నాయకులను సీఎం కేసీఆర్ అణిచివేసి రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని ద్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు ఎంతో పౌరుషం ఉద్యమ స్ఫూర్తి కలిగిన మట్టి బిడ్డలని అణిచివేతలు దుఃఖాన్ని బాధలను భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోరని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.. బండారు దత్తాత్రేయ

అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గతంలో నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఫ్లోరైడ్ రక్కసి తో ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యారని ఈ ప్రాంత ప్రజలు నివారణకు ఉద్యమం చేపట్టిన కాలంలో తాను కేంద్ర మంత్రి గా పనిచేస్తున్నాని, నాడు ప్రధానమంత్రి వాజపేయి కి దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని గుర్తు చేశారు.


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు దేశవ్యాప్తంగా గుర్తించే విధంగా కృషి చేస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ని కవులను కళాకారులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, నాయకులు జగన్మోహన్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, శ్యామ్ గౌడ్ లక్ష్మీనారాయణ, పిశాటి అంజిరెడ్డి, కళాకారులు ఉద్యమకారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News