దిశ, మేళ్లచెరువు: రానున్న రోజుల్లో దేశ భవిష్యత్ యువత మీదే ఆధారపడి ఉందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం కమిటీ పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత స్వయం కృషితో ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. గ్రామాల్లో యువత సమస్యలను గుర్తించి నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో యువతకు పెద్ద పీట వేసే అవకాశాలున్నాయని చెప్పారు.
యువత కోసం ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడానికి యువత ముఖ్య భూమిక పోషించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువత మీద ఉందని ఆయన అన్నారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు.
ఈ సందర్భంగా మహాశివరాత్రి జాతరకు ఎద్దుల బండలాగుడు పందెపు బహుమతులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖుషి ఫౌండేషన్ అధినేత నర్సిరెడ్డి తో పాటు సర్పంచ్ పందిల్లపల్లి, శంకర్ రెడ్డి మాజీ సర్పంచ్ వెంక రెడ్డి , కమతం నారాయణ బాల వెంకట్ రెడ్డి, బచ్చు శ్రీనివాస్ రెడ్డి యువత పాల్గొన్నారు.