హోటళ్లలో అధికారుల తనిఖీలు..
భువనగిరి పట్టణంలోని పలు హోటల్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు నిర్వహించారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని పలు హోటల్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నియమాలు పాటించని హోటల్స్ పై రూ. 30 వేల జరిమానా విధించి, నోటీసులు జారీ చేశారు. హోటల్స్ వంటగదిని, స్టోర్ రూమ్, భోజనశాలలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలను, కూరగాయలను, గమనించి అప్పటికప్పుడు చెత్త బుట్టలో వేశారు.
తాజా కూరగాయలను, ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన నూనె, పప్పులు, పిండి మొదలగు పదార్థాలను డేట్ అయిపోకముందే వాడాలని, తయారు చేసిన ఆహార పదార్థాలు ఈగలు, దోమలు, బొద్దింకలు పడకుండా శుభ్రంగా ఉంచాలని, నిల్వ ఉంచిన, కుళ్ళిన, ఆహార పదార్థాలను వాడకూడదని, తాజ ఆహార పదార్థాలని ప్రజలకు అందించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామాంజనేయ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు ఉన్నారు.