బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! కాంగ్రెస్‌లోకి వెళ్లనున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు

సూర్యాపేటలో బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ తగలబోతుంది. పార్టీకి చెందిన 30 మంది కౌన్సిలర్లలో 15 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు.

Update: 2024-01-14 02:37 GMT

దిశ, సూర్యాపేట: సూర్యాపేటలో బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ తగలబోతుంది. పార్టీకి చెందిన 30 మంది కౌన్సిలర్లలో 15 మంది అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. మిగిలిన 15 మంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ కొనసాగుతోంది. 32 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందజేశారు. తీర్మానం నెగ్గాలంటే 25 మంది కౌన్సిలర్ల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన పెరుమాళ్ల అన్నపూర్ణ చైర్‌ పర్సన్‌గా, వైస్‌ చైర్మన్‌గా పుట్ట కిషోర్‌ ఉన్నారు. 2020 జనవరి 27న ప్రమాణస్వీకారం చేసిన ప్రస్తుత పాలకవర్గానికి మరో ఏడాది వరకు కాల పరిమితి ఉంది. వీరిని పదవి నుంచి తొలగించేందుకు బీఆర్‌ఎస్2కు చెందిన కౌన్సిలర్లే పావులు కదుపుతున్నారు. హైదరాబాద్‌ వేదికగా క్యాంప్‌ రాజకీయాలకు తెర లేపారు.

ఉమ్మడి నల్గగొండ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆశీనులై ఉన్న పదవులపై కన్నేసి వారి పీఠాలను కదిలిస్తున్న విషయం తెలిసిందే. అందుకు వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పీఠాలు కూడా కదలబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి కౌన్సిలర్లే సిద్ధం కావడం, అందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించడంతో దాదాపు వారి పదవులు ఊడే అవకాశం మాత్రం మెజారిటీని బట్టి చూస్తే మెండుగానే కనిపిస్తోంది.

ఇందుకోసం మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లపై ఈనెల 10న బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి కౌన్సిలర్లకి ఇతర పార్టీల కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో 32 మంది అవిశ్వాస తీర్మాణ పత్రంపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ వెంకట్రావుకి వినతిపత్రం అందించిన విషయం విధితమే. ఈ అవిశ్వాసంపై మాట్లాడేందుకు తాజా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై ఆయనకి ఎదురు మాట్లాడేందుకు ఇతరులకు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే, ప్రస్తుతం అవిశ్వాసానికి కావాల్సిన సమయం రావడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అసమ్మతి కౌన్సిలర్లకి అవకాశం వచ్చినట్లు అయింది. ఈ విషయాన్ని పసిగట్టిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం రోజు అనుసరించాల్సిన తీరుపై దామోదర్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే చర్చించినట్లు తెలిసింది.

అందుకు అనుగుణంగానే చైర్మన్ రేసులో ఉన్న కొండపల్లి నిఖిల దిలీప్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం 33 మంది కౌన్సిలర్లు అవసరం కావాల్సి ఉన్నప్పటికీ, 32 మందిని రాష్ట్ర రాజదానిలోని ఓ రెండు ప్రదేశాలకు క్యాంపునరే తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా, వీరు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన పత్రానికి 15 రోజుల గడువులో తీర్మానం పెట్టాల్సి ఉండగా, ఈ నెల 27 నాటికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావస్తున్నందున అదేరోజు ఆ నోటీసుపై ఉదయం చైర్ పర్సన్ పదవిపై, మధ్యాహ్నం వైస్ చైర్మన్ పదవిపై ఓటింగ్ నిర్వహించేందుకు కలెక్టర్ పాలక మండలికి నోటీసులు అందజేసినట్లు తెలిసింది. అది ముగిసిన మరుక్షణమే అసమ్మతి కౌన్సిలర్లు అంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఈ విషయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తనదైన స్టైల్లోనే మౌనం వహించడం పట్ల సూర్యాపేటలో చర్చనీయాంశం అవుతోంది.

అభివృద్ధి చేశామని ప్రచారం..

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 48 వార్డుల్లో అభివృద్ధి జరగకపోవడం వల్లే నేడు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టిన రోజు కొంతమంది కౌన్సిలర్లు ప్రధానంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ అదే జరిగి ఉంటే సూర్యాపేట పట్టణం అభివృద్ధి చేశామని అదే కౌన్సిలర్లు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేశారని నేడు పట్టణ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారని టాక్. నిజంగా ఆరోజు నుంచి ఈరోజు వరకు అభివృద్ధిని కోరుకున్న కౌన్సిలర్లు ఉంటే కనీసం ఒక్క రోజైనా ప్రశ్నించక పోవడం వెనుక ఉన్న అంతర్యాన్ని కనీసం ఇప్పుడైన బయట పెడతారా అని జనం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా సూర్యాపేటలో స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత తగ్గడం వల్లే సొంత పార్టీ నాయకులు అవిశ్వాస తీర్మానని నేడు తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లు ఈ నెల 27న జరిగే అవిశ్వాసానికి ముందే రాజీనామా చేస్తారా..? లేదా అనేది మాత్రం సందిగ్ధం నెలకొంది.

ఘాటు లేని రేటట?

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని ఆశించి 32మంది కౌన్సిలర్లను హైదరాబాద్ క్యాంపుకి తీసుకెళ్లిన వ్యక్తులు మాత్రం ఇక వారి పదవీకాలం కేవలం ఒక ఏడాది మాత్రమే మిగిలి ఉండడంతో సహజంగా జరిగే ప్రక్రియలో మాత్రం పసలేదన్నట్లుగా సమాచారం అందుతోంది. 2014 లో చైర్మన్ ఎన్నిక సందర్భంగా నిర్వహించిన క్యాంపులో మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు భారీ స్థాయిలో సుమారు రూ.20 నుంచి 30 లక్షల వరకు తాయిలాలు అందిన విషయం తెలిసిందే. అప్పుడు పరిస్థితుల ద్వారా మరల 2018లో అవిశ్వాసం తెర మీదకు రావడంతో మరోసారి క్యాంపులకు వెళ్లకుండానే నాటి చైర్మన్ మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అందరు అలాగే ఉంటుందని ఊహించినప్పటికీ ప్రస్తుతం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల ముట్టజెప్పి మద్దతును పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎవరకి తాయిలాలు ముట్టినా, ముట్టకపోయినా కౌన్సిలర్లు మాత్రం తాము అనుకున్నది చేసే తీరుతాం అనే సంకేతాన్ని ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఎమ్మెల్యే ఆధీనంలో కౌన్సిలర్లు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తనకు అనుకూల వర్గ కౌన్సిల్లర్లతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు చైర్ పర్సన్, వైస్ పర్సన్‌లపై ఈనెల 27న జరిగే అవిశ్వాస తీర్మాణం వీగిపోయేలా కౌన్సిలర్లకి పలు సూచనలు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఉన్న 48 కౌన్సిలర్లలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం పొంది, పదవికి రాజీనామా చేయగా.. ఆ వార్డు ఎన్నిక జరగలేదు. కాగా 47 మంది కౌన్సిలర్లకు గాను 32 మంది హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు. ఎమ్మెల్యేకు సుమారు 15 మంది కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ అవిశ్వాసానికి 33 నుంచి 36‌కి మెజారిటీ తగ్గకుండా కాబోయే చైర్మన్ ఇతర కౌన్సిలర్లతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే వైపు ఉన్న కౌన్సిలర్లు వీరే..

1) షేక్ భాషా (5వ వార్డు )

2) పెరుమాళ్ల అన్నపూర్ణ (9వ వార్డు)

3) చింతలపాటి భరత్ మహాజన్ (17వ వార్డు )

4) సుంకరి అరుణ రమేష్ (19వ వార్డు )

5) పుట్ట కిషోర్ (22వ వార్డు )

6) వల్దాస్ సౌమ్య జానీ (23వ వార్డు )

7) బత్తుల లక్ష్మి జానీ ( 24 వ వార్డు )

8) ఆకుల కవిత లవకుశ(25వ వార్డు)

9) నిమ్మల స్రవంతి శ్రీనివాస్ (26వ వార్డు )

10) కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి (33వ వార్డు )

11) మడిపెల్లి విక్రమ్ (34వ వార్డు )

12) గండూరి ప్రవళిక ప్రకాష్ (36వ వార్డు )

13) మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ ( 39వ వార్డు )

14) తాహెర్ పాష (40వ వార్డు )

15) అంగిరేకుల రాజశ్రీ నాగార్జున (42వ వార్డు )

Tags:    

Similar News