Komatireddy Venkat Reddy : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి భేటీ..?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ నాయకుడు ఎటువైపు చూస్తున్నారు.
దిశ, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ నాయకుడు ఎటువైపు చూస్తున్నారు. ఎవరి పంచనా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంతుచిక్కడం లేదు ఉదయం ఒక నాయకునితో చర్చ జరిగిన నాయకుడు మధ్యాహ్నం తర్వాత భేటీ అవుతున్న విషయం చూస్తున్నాం, అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి సెగలు, అభ్యర్థులను ప్రకటించని పార్టీలలో నియోజకవర్గాలలో పదుల సంఖ్యలో పోటీ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కొంతమంది నాయకులు తమ నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోతే తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో ఆయా నాయకులు ఎప్పుడు ఎక్కడ దర్శనమిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కోమటిరెడ్డి.. మోత్కుపల్లి భేటీ....?
దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో బీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు నల్లగొండ జిల్లాలో ఎక్కడి నుంచి పార్టీ టికెట్ కేటాయించిన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాటను బయట పెట్టాడు. కానీ పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులకు మళ్ళీ సీట్లు కేటాయించడంతో మోత్కుపల్లి అలకబూనినట్లు సమాచారం. ఇదే తరుణంలో ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని చెప్పి ఆయన భావిస్తున్నట్లు వినికిడి. అందులో భాగంగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రెండు రోజుల క్రితం భేటీ అయినట్లు సమాచారం. అందులో ఆలేరు తుంగతుర్తి సెగ్మెంట్లపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఆలేరు జనరల్ సీట్ కావడంతో అక్కడ పోటీ చేయడం కష్టమని ఇక తుంగతుర్తి పైన ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది.
గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్‌కు కోమటిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో మాదిగల ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నందున ఈ సారి మాదిగ సీటు కేటాయించాలని ఒత్తిడి కూడా పెరిగింది. అయితే అక్కడ మాదిగ సామాజిక వర్గం చెందిన బలమైన నాయకుడు లేకపోవడం కాంగ్రెస్ కొంత మైనస్ అని చెప్పొచ్చు. అందుకే మోత్కుపల్లి తుంగతుర్తి పై కన్నేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీలో చేరితే టికెట్ కేటాయింపు విషయమై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. వెంకటరెడ్డి కూడా దయాకర్‌ను రాజకీయంగా అడ్డు తొలగించడానికి మోత్కుపల్లి బాణం వేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇద్దరి మధ్య స్పష్టమైన హామీలు మాత్రం ఏమి ఇచ్చిపుచ్చుకోలేదని తెలుస్తుంది. కోమటిరెడ్డితో భేటీ విషయమై మోత్కుపల్లి నరసింహులును వివరణ కోరగా తనకు కోమటిరెడ్డి కి మధ్య ఎలాంటి చర్చలు, భేటీలు జరగలేదని చెప్పారు.