బస్తాల లొల్లి..మార్కెట్ బంద్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్లో హమాలీలకు కొనుగోలుదారులకు మధ్య కాంటాలకు ఉపయోగించే బస్తాల విషయంలో గొడవ జరుగుతుంది.

Update: 2024-10-19 12:06 GMT

దిశ, తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్లో హమాలీలకు కొనుగోలుదారులకు మధ్య కాంటాలకు ఉపయోగించే బస్తాల విషయంలో గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. గన్నీ (తట్టు)బస్తాలను వినియోగించాలని,ప్లాస్టిక్ బస్తాలు వద్దని,ఖరీదుదారులు ప్లాస్టిక్ బస్తాలు వాడాలని ఇరువురి మధ్య బస్తాల లొల్లితో వ్యవసాయ మార్కెట్ బందు చేశారు. నిత్యం ధాన్యంతో..రైతులతో రద్దీగా దర్శనమిచ్చే మార్కెట్ షెడ్లు.. మార్కెట్లో ధాన్యం లేక ఖాళీ షెడ్లతో బోసిపోయాయి. రైతన్నలు ధాన్యంను మిల్లుల వద్ద, గ్రామాల్లో వ్యాపారస్తుల వద్ద తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని హమాలీలు,ఖరీదారులు తీసుకువచ్చారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న ఐకెపి కేంద్రాలకు ధాన్యం తెచ్చేందుకు రైతులు సాహసం చేయలేకపోతున్నారు. అకాల వర్షాల ముప్పుకు దాన్యం తడిసిపోతుందని భయాందోళనలో తెచ్చిన ధాన్యంను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మంగళవారం రైతులు ఆందోళనలకు దిగడంతో తహాశీల్దార్,మార్కెట్ కార్యదర్శి,సబ్ ఇన్స్పెక్టర్ పలువురితో చర్చలు జరిపారు. హమాలీలకు,కొనుగోలుదారులకు, రైతులకు సర్దిచెప్పడంతో ఆరోజు కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. తర్వాతి రోజు సమస్య జఠిలం కావడంతో గురువారం మార్కెట్ కు సెలవు ప్రకటించగా శుక్రవారం,శనివారం పూర్తిగా మార్కెట్ కు ధాన్యం రాక కొనుగోలు పూర్తిగా ఆగిపోయాయి. హమాలీలు,ఖరీదుదారులు పట్టువిడుపులు వదిలి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ ఇద్దరికీ సర్ది చెప్పిన వినడం లేదన్నారు. రైతులు ఎమ్మెల్యే మందుల సామెల్ దృష్టికి సమస్యను తీసుకుపోగా..ఇరువర్గాలు సమన్వయంతో ముందుకు పోవాలని సూచించినట్లు సమాచారం. శనివారం మార్కెట్ కు ధాన్యం రాకపోవడంతో ఖాళీగానే మార్కెట్ ప్రాంగణం కనిపించింది. జిల్లా కలెక్టర్ అయినా జోక్యం చేసుకొని గన్ని బస్తాల సమస్యను పరిష్కరించాలని రైతులు,మార్కెటింగ్ శాఖ కోరుతున్నారు. ఏది ఏమైనా రైతాంగానికి నష్టం కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సోమవారం నాటికైనా మార్కెట్ యధాతధంగా నడిచేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News