ముందస్తు అరెస్టులతో బంద్ భగ్నం..
టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యల పై నిరసన తెలుపుతూ ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆదివారం ఉమ్మడి నూతనకల్ మండల బంద్ కు పిలుపునిచ్చాయి.
దిశ, నూతనకల్ : టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యల పై నిరసన తెలుపుతూ ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆదివారం ఉమ్మడి నూతనకల్ మండల బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ జరగకుండా పోలీసులు ఉదయం 5 గంటలకే ముఖ్యనాయకులను వారి ఇంటి వద్ద అరెస్టు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు. శాంతియుతంగా నిరసనలో భాగంగా బందుకు పిలుపునిచ్చిన ప్రతిపక్ష ఎమ్మార్పీఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి వారి ఆచూకీ తెలపకుండా ఉండడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు నూతనకల్ మండల కేంద్రంలోని సూర్యాపేట, దంతాలపల్లి ప్రధాన రహదారి పై నిలబడి నిరసన తెలిపారు.
నిరసనలో పాల్గొన్న వారిని తమ వాహనాలలో పెన్పహాడ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా శాంతియుతంగా ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. తక్షణమే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రతిపక్ష, ఎమ్మార్పీఎస్ నాయకుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనాటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజయ్య, చంద్రకళ, పీఎసీఎస్ డైరెక్టర్ నాగం జయసుధ, ఇమ్మారెడ్డి రాజబహూదూర్ రెడ్డి, మహేష్ రెడ్డి, బండపల్లి సాగర్, ముత్యం ప్రసాద్, మరికంటి అశోక్, జూలూరు కేశవాచారి, మరికంటి నవీన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.