అంతరాష్ట్ర గంజాయి రవాణా నిందితుడి అరెస్ట్ : నల్లగొండ ఎస్పీ అపూర్వరావు
గంజాయి అక్రమంగా రవాణా చేసే అంతరాష్ట్ర నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
284 కేజీల గంజాయి స్వాధీనం
దిశ, నల్లగొండ: గంజాయి అక్రమంగా రవాణా చేసే అంతరాష్ట్ర నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా దాడులు చేశామని తెలిపారు. పెద్దవురా పోలీసుల విశ్వనీయ సమాచారం మేరకు 16న సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక హుందాయ్ వెర్నా నలుపురంగు నెంబరు (TN 74 AV 6800) కారును ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో 42 ప్యాకెట్లలో ఉన్న సుమారు రూ.55లక్షల విలువగల 284 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అదేవిధంగా కారులో ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా తనపేరు శక్తితని గైరాజ తండ్రి పేరు సేతురం తమిళనాడు రాష్ట్రమని తెలిపాడని పేర్కొన్నారు. ఆంధ్రలోని నర్సీపట్నం కి చెందిన వీరబాబు మరియు కృష్ణల వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని తమ రాష్ట్రం తమిళనాడులో ఎక్కువ ధరకు అమ్మలనే ఉద్దేశ్యంతో కారులో పెట్టుకొని రాజమండ్రి నుంచి తమిళనాడుకు వెళ్తుండగా బోలపల్లి టోల్ ప్లాజా వద్ద ఆంద్రప్రదేశ్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. టోల్ గేట్ ను ఢీకొట్టి దాటుకుని వాహనాన్ని దారి మళ్లించి మాచర్ల మీదగా నిందితుడు నాగార్జున సాగర్ లోకి ప్రవేశించాడని తెలిపారు.
పోలీసులు సుమారు 20 నిమిషాలు ఛేజ్ చేసి పట్టుకోవాలని చూడగా కారును వదిలి గోడ దూకి పారిపోవాలనుకున్న నిందితుడికి కాలుకి గాయం అయినట్లు ఎస్పీ తెలిపారు. అతడి నుంచి కారు,284 కిలోల గంజాయి, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలోని సీఐ నాగరాజు, పెద్దవురా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేష్,హెడ్ కానిస్టేబుల్ కె.శంకర్ బాబు, పీసీ కిషన్, మట్టయ్యను ఎస్పీ అపూర్వరావు ప్రత్యేకంగా అభినందించారు.