ఒక్క అధికారి .. రెండు పదవులు.. ఎన్ని ఏండ్లు ఉంటాడు ఇక్కడే..?

నల్లగొండ జిల్లాలో దశాబ్దం పైగా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పీడీ కొనసాగుతున్న

Update: 2025-03-22 01:45 GMT
ఒక్క అధికారి .. రెండు పదవులు.. ఎన్ని ఏండ్లు ఉంటాడు ఇక్కడే..?
  • whatsapp icon

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దశాబ్దం పైగా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పీడీ కొనసాగుతున్న ఆ అధికారి ఇంకో బాధ్యత తో ప్రస్తుతం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఉన్నతాధికారిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన 22 వ తేదీ జూలై 2014 లో నల్లగొండ గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గా వచ్చారు నేటికి అలానే అదే సీటులో అతుక్కుని పోయారు. పాలనలో సమతుల్యత అవసరమైన సమయంలో ఒకే అధికారి రెండు కీలక శాఖల బాధ్యతలు నిర్వహించడం, జిల్లాలో అభివృద్ధిని కంటిచూపు దూరంలో ఉంచుతోంది. ముఖ్యంగా, ప్రభుత్వ మార్పుతో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం పై సరైన పర్యవేక్షణ లేకుండా పోతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అధికారి 10 ఏండ్లుగా నల్లగొండ కలెక్టర్ కార్యాలయం లోని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తోంది.10 ఏండ్లుగా ఇక్కడే పాతుకుపోవడం పై ఆయన నైజం జిల్లాలో స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్కరికే రెండు బాధ్యతలు.. బాధితులు ప్రజలే..

ప్రతి శాఖకు ప్రత్యేక అధికారి ఉంటేనే పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ ఒకే అధికారి రెండు కీలక శాఖలు చూస్తే, ఏ శాఖనైనా తగినంత సమయం కేటాయించగలరా ఇదే ప్రశ్న ఇప్పుడు జిల్లా వాసులను కలవరపెడుతోంది.ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన ఈ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది.ఇప్పటికే జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్టులు నిలిచిపోతే, కొత్త పథకం సజావుగా అమలు అవుతుందా.కొత్త ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అవుతున్న,అధికారుల అసమర్థత వల్ల లబ్ధిదారులు ఎదురుచూపులేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది.

అందని ద్రాక్షగా గిరిజన సంక్షేమ ఫలాలు..

జిల్లాలో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం నూతన ప్రణాళికలు, పథకాలు తీసుకురావడం జరుగుతోంది.కానీ వీటి అమలుకు ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అధికారి, ఇప్పటికే హౌసింగ్ శాఖలో నిమగ్నమైతే, గిరిజన అభివృద్ధికి ఏ స్థాయిలో న్యాయం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గిరిజన సంక్షేమ నిధుల వినియోగం అర్ధాంతరంగా ఉండటానికి కారణం ఇదేనా.పూర్తి స్థాయిలో సమయం హౌసింగ్ మీద ఉండకపోవడం వలన గిరిజన అభివృద్ధి అధికారి పర్యవేక్షణ కొరవడం వల్ల గత ఐదు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చినటువంటి మెనూ హాస్టల్ లో ఇంతవరకు అమలు కాకపోవడం వెనుక పెద్ద ఎత్తున ఈ అధికారికి గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్లు 10 నుంచి 20 శాతం వాటా వెళ్తున్నట్లు అందువలన బిల్లులు మంజూరు అవుతున్నాయని బలమైన ఆరోపణ.గిరిజనులు కు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు మొత్తం కూడా అందడం లేదు కలగా మిగిలిపోయాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారి ఒక్కరినీ పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.

దశాబ్దం పాటు హౌసింగ్ పీడీగా కొనసాగడమే వెనుక అంతర్యం ఏంటి..

సాధారణంగా, ప్రతి అధికారి మూడేళ్లకోసారి బదిలీ అయ్యే నిబంధన ఉంది. కానీ ఆ అధికారి మాత్రం 10 ఏళ్లుగా హౌసింగ్ పీడీగా మార్పులు లేకుండా కొనసాగడం వెనుక ఏమున్నది.పాలక వర్గాల ప్రోత్సాహం ఉందా..పదవులు మారనివ్వకుండా కొందరి ప్రయోజనాలు దాగున్నాయా..ఇప్పటికీ జిల్లా కలెక్టరేట్ లో ఉన్నత అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వం మారినా మారని అధికారి విచారణ అవసరం..

ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అన్ని పథకాల అమలును పునః సమీక్షిస్తుంది. హౌసింగ్ ప్రాజెక్టు, గిరిజన సంక్షేమంలో నిధుల వినియోగం ఎలా జరిగింది పదవులు ఎందుకు మారలేదు అనే అంశాలను సంక్షిప్తంగా కాకుండా,సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. జిల్లా అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఒకే వ్యక్తి రెండు కీలక పదవుల్లో కొనసాగడాన్ని వెంటనే పునఃపరిశీలించాలని, స్థానిక మేధావులు,ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికైనా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని ఒక్క అధికారి ఒక్క బాధ్యత అనే విధానం పని చేయాలి అని కోరుతున్నారు.


Similar News