6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం..ఏఐసీసీ సెక్రటరీ

తుక్కుగూడలో విజయభేరీ బహిరంగ సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ విష్ణునాథ్ అన్నారు.

Update: 2023-09-18 11:57 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : తుక్కుగూడలో విజయభేరీ బహిరంగ సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ విష్ణునాథ్ అన్నారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో మీడియాతో మాట్లాడి అనంతరం పట్టణంలోని జలీల్ పుర కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతూ వేల కోట్లు సంపాదించుకున్నారన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఐదు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అమల్లోకి మిగిలిన ఒక గ్యారెంటీ కూడా జనవరిలో అమలు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మీ ద్వారా మహిళలకు ప్రతినెల 2500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.

రైతు భరోసా ద్వారా ప్రతీ ఏటా రైతులు, కౌలు రైతులకు 15వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ అందిస్తామన్నారు. గృహ జ్యోతి ద్వారా మీ కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఐదు లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామన్నారు. యువవికాసం ద్వారా విద్యార్థులకు ఐదులక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు నిర్మిస్తామన్నారు. చేయూత గ్యారెంటీ ద్వారా పింఛన్ 4000 రూపాయలు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, బీర్ల ఐలయ్య, జిట్టా బాలకృష్ణారెడ్డి, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, పంజాల రామాంజనేయులు గౌడ్, తంగళ్ళపల్లి రవికుమార్ తదితరులు ఉన్నారు.


Similar News