హత్య కేసులో నిందితుడు అరెస్టు, రిమాండ్

వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

Update: 2024-06-26 13:23 GMT

దిశ, మిర్యాలగూడ : వ్యక్తిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జునసాగర్ లో ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్మాణంలో భాగంగా హిల్ కాలనీకి చెందిన సయ్యద్ రెహమాన్ ( 35) ఎలక్ట్రిషన్ గా పని చేస్తూ పాఠశాల ఆవరణలోని ఉంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం ఇన్నిస్ పేట కు చెందిన సిరాపు నాగబాల శివసాయి రెడ్డి పాఠశాలలో ఈ నెల 23న పెయింటింగ్ కోసం పనికి వచ్చాడు. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో శివసాయి రెడ్డి పెయింటింగ్ పనుల కోసం వచ్చి రెహమాన్ తో గొడవ పడ్డాడు.

ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి రావడంతో డ్రిల్లింగ్ మిషన్ బిట్టుతో రెహమాన్ కుడికంతపై గట్టిగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో రెహమాన్ అక్కడక్కడ మృతి చెందాడు. వెంటనే మృతదేహాన్ని పక్కనే ఉన్న ప్లాస్టిక్ బ్యాగులో కట్టి పాఠశాల ఆవరణలో గుంత తీసి పూడ్చి పెట్టాడు. విషయం తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 24న పాఠశాల ఆవరణలో రక్తం కనిపించడంతోపాటు ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో రెహమాన్ మృతదేహం లభించడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయపురి టౌన్ పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా బుధవారం పెద్దవూర సమీపంలోని వై జంక్షన్ వద్ద శివసాయి రెడ్డి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి, పోలీసు పద్ధతిలో విచారణ చేపట్టగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పాటు నిందితుడి అడ్రస్ తెలియకపోయినప్పటికీ 24 గంటల్లోనే కేసులు ఛేదించిన నాగార్జునసాగర్ సీఐ బీసన్న, హాలియా సీఐ జనార్దన్, విజయపురి టౌన్ ఎస్సై సంపత్, పెదవుర ఎస్సై వీరబాబు, తిరుమలగిరి ఎస్ఐ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు గురునాథం, హరిలాల్, హోంగార్డు శ్రీకాంత్ లను ఎస్పీ శరత్ చంద్ర,డీఎస్పీ రాజశేఖర్ రాజులు అభినందించారు.

Similar News