కనుమరుగై....కళకళలాడుతూ..

వందల సంవత్సరాల క్రితం విశేష చరిత్ర సంతరించుకొని అశేష భక్త జన ఆధదాభిమానాలను చూరగొంటు కాలక్రమేణ కనుమరుగైన దేవాలయం నేడు కొంతమంది భక్తుల చొరవతో వెలుగులోకి వచ్చింది.

Update: 2023-05-28 10:17 GMT

దిశ, తుంగతుర్తి : వందల సంవత్సరాల క్రితం విశేష చరిత్ర సంతరించుకొని అశేష భక్త జన ఆధదాభిమానాలను చూరగొంటు కాలక్రమేణ కనుమరుగైన దేవాలయం నేడు కొంతమంది భక్తుల చొరవతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు దేవాలయ విశిష్టతను గ్రహించిన గ్రామస్తులంతా తిరిగి పునరుద్ధరణకు నడుం బిగించారు. అంతేకాకుండా చుట్టుపక్క ప్రాంతాల భక్తులు ఆర్థికంగా తలా ఓ చెయ్యి వేశారు. అంతరించిపోయిన దేవాలయ ప్రతిష్టను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. దీంతో ఈ నెల 29 నుండి జూన్ 1వ తేదీ వరకు దేవాలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ట, తదితర మహోత్సవ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. తుంగతుర్తి మండలం దేవుని గుట్టతండ (వెంపటి) గ్రామ పరిధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర ఇది.

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం ఆనాడు నిత్య పూజలతో అశేష భక్త జనావళి ఆదరాభిమానులతో కళకళలాడేది.”కోరుకున్న కోరికలు నెరవేరగలవు” అనే నమ్మకంతో అనేక ప్రాంతాల భక్తులు పూజలు జరిపేవారు. అయితే కాలానుగుణంగా కాకతీయుల కాలం అంతరించి పోవడంతో దేవాలయం కూడా నిరాదరణకు గురైంది. చివరికి గుర్తుతెలియని దుండగులు జరిపిన గుప్తనిధుల తవ్వకాలతో శిథిలమైంది. ధ్వజస్తంభం ధ్వంసమైంది. పట్టించుకునేవారు లేకపోవడంతో చివరికి దేవాలయం కనుమరుగైపోయింది.

దేవునిగుట్ట గ్రామపంచాయతీ ఏర్పడ్డాక...

మొదటి నుండి వెంపటి గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న దేవునిగుట్ట తండాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించింది. కాగా కొంతమంది భక్తుల ఆధ్వర్యంలో దేవునిగుట్ట తండ గ్రామగుట్టపై శిధిలావస్థలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనవాళ్లు మళ్లీ వెలుగు చూశాయి. ఈ మేరకు “ఇంతింతై వటుడింతై” అనే సామెత మాదిరిగా క్రమక్రమంగా పెరిగిపోయిన భక్తుల ఆధ్వర్యంలో దేవాలయం మరింత ప్రచారంలోకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గుగులోతు వీరోజి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖులంతా ఐక్యమై దేవాలయ పునరుద్ధరణకు నడుంబిగించారు. దేవాలయానికి శ్రమించి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేశారు. దీనికి తోడు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన శ్రీకాంత్ దేవాలయంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.

రూ.15 లక్షల వ్యయంతో ఉత్సవాలు..

తొలుత అభివృద్ధి కమిటీ దేవాలయ పునరుద్ధరణకు అవసరమయ్యే ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వాములయ్యే వారందరినీ కలుపుకున్నారు. వెంపటి (తుంగతుర్తి) గ్రామానికి చెందిన తల్లాడ నారాయణ సొంత ఖర్చులతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. చెరివిరాల సుధాకర్ విగ్రహాలు, గుగులోతు వెంకన్న సుదర్శన చక్రం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రూ.25 వేల నగదుతో పాటు దేవాలయ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. గ్రామసర్పంచ్ వీరోజి రూ.50 వేలు, ఉపాధ్యాయుడు జగన్ రూ.ఒక లక్ష నగదు, తుంగతుర్తికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శివకోటి యాకానంద చారి సొంత ఖర్చులతో (ఎస్ వై చారి) విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పలువురు వివిధ రకాలుగా విరాళాలు అందించారు. దీనికి తోడు గ్రామంలో దాదాపు 140 కుటుంబ యజమానులు ఒక్కొక్క ఇంటికి రూ.3 వేల నగదు చొప్పున ఇవ్వడానికి తీర్మానించుకున్నారు.

నేటి నుండి వచ్చే నెల 1వరకు ఉత్సవాలు..

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 29 నుండి జూన్ ఒకటవ తేదీ వరకు ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అభివృద్ధి కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 29న విశ్వక్సేన పుణ్యవచనం, రక్షాబంధనం మృతు సంగ్రహణం అంకుర్పణ దీక్ష స్వీకారం జలధివాసం, 30న యాగశాల స్థాపన ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన అగ్ని ప్రతిష్ట మూల మంత్ర హోమాలు, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి నవ కలశ స్థాపనం, ధ్వజ కుంభ ఆరాధన మూల మూర్తి మంత్ర జప హోమాదులు, తదితరవి నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అలాగే 3, వచ్చేనెల 1న వివిధ రకాల హోమాలు, ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ వివరించింది. హైదరాబాద్ కు చెందిన పూజారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగునున్నాయి.

Tags:    

Similar News