ఏపీ బలగాల భద్రత పరిధిలో సాగర్ ప్రాజెక్టు
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది.

దిశ, నాగార్జున సాగర్ : నాగార్జునసాగర్ డ్యామ్ భద్రత పై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. సాగర్ ప్రధాన డ్యామ్ వద్ద పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు విధులు నిర్వర్తించే విషయంలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. డ్యామ్‌లో తెలంగాణ వైపున విధులు నిర్వర్తిస్తోన్న ములుగుకు చెందిన 39వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని వెనక్కి రమ్మని ఆదివారం ఆదేశాలు అందాయి. ఏపీ వైపు పహారాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కూడా రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఆదేశాలు వచ్చాయి. గత ఏడాది డిసెంబరు 28న కూడా వెనక్కి రావాలని తెలంగాణ వైపున ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఇలానే ఆదేశాలు రాగా వారు నల్లగొండ దాకా వెళ్లారని, విధుల్లోనే కొనసాగాలని సాయంత్రం మళ్లీ ఆదేశాలు రావడంతో రాత్రికి తిరిగి సాగర్‌కు చేరుకున్న విషయం తెలిసిందే
తెలంగాణకు న్యాయం దక్కేనా..?
కృష్ణానది పై ఉన్న కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించి తరచూ సాగర్ డ్యామ్ విషయంలోనే వివాదం జరుగుతోంది. నిజానికి ఈ వివాదం దశాబ్దాల తరబడి నుంచి వస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. తెలంగాణకు కేటాయించిన వాటా ప్రకారం నీళ్లను వినియోగించుకోవడంలో అన్యాయం జరుగుతోందనేది ఇక్కడి ప్రజల మాట. ఏపీ తనకు కేటాయించిన వాటాతో పాటు అదనంగా నీటిని తరలించుకుపోయిందని తెలంగాణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గత పదేండ్లు కేసీఆర్ అధికారంలో ఉండడం.. నాగార్జునసాగర్ డ్యామ్ పై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ఎంతసేపటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరో ప్రాజెక్టును పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గత ఐదేండ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీళ్లను ఏకంగా కేసీఆర్ గాలికొదిలేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏపీ అధికారులు ఇష్టారాజ్యంగా సాగర్ నీటిని తరలించుకుపోయారు. ఆఖరికి టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసుకుపోయిందనే విమర్శలున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండతో పాటు హైదరాబాద్ జంట నగరాలు తాగునీటి కోసం అల్లాడి పోయాయి. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది.
ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు
అయితే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం సైతం వీరి హయాంలో సద్దుమణిగితే.. తెలంగాణకు నీటి విషయంలో న్యాయం దక్కే అవకాశం కన్పిస్తోంది. అందులో భాగంగానే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉన్న కామన్ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలంను కృష్ణా నది యాజమాన్య సంస్థకు అప్పగించేది లేదంటూ తీర్మానం చేసింది. దీనికి తోడు నాగార్జున సాగర్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా తీర్మానం పేర్కొంది.
నవంబరులో ఏం జరిగిందంటే..?
కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పట్నుంచో వివాదం ఉంది. కానీ తెలంగాణలో సెంటిమెంట్ అంశాన్ని వినియోగించుకోవాలన్న ప్రతిసారి నాగార్జునసాగర్ డ్యామ్ పై ఉద్రిక్తత నెలకొంటుంది. అందులో భాగంగానే 2023 నవంబర్ 29న తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది. అలాంటిది నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా పోలీసులను పంపించింది. పోలీసుల సాయంతో నీటిని విడుదల చేయించింది. ఈ సమయంలో 13వ గేటు వద్ద పోలీసులు కంచె వేశారు. కుడి కాలువ నుంచి దాదాపు 5,450 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు గత ఐదేండ్లలో కాలంలో తరచూ జరగడం అందరికీ తెలిసిందే.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఘటన
నాగార్జున సాగర్ ప్రధాన డ్యాం పై సీఆర్పీఎఫ్ భద్రత తొలగించారు. నాగార్జున సాగర్ డ్యాం తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వచ్చింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. సాగర్ నిర్వహణ పై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు, సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏ అవుట్‌లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాల పై ఇద్దరు సీఈవోలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ సూచించింది. సాంకేతిక అంశాల పై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది.
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం 13వ క్రెస్ట్ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ క్రమంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ఉద్రికత్త తగ్గింది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన కూడా చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్ ఎంబీ ఆధీనంలో ఉండటంతో సీఆర్ పీఎఫ్ బలగాలతో భద్రత నిఘాలో ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన రావడంతో సీఆర్పీఎఫ్ నుంచి భద్రతా పరమైన చర్యలను తెలంగాణ పరిధిలో డ్యాం భద్రతను ఆధీనంలోకి తీసుకున్న ఏపీ వైజాగ్ కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ టీమ్ అప్పజెప్పారు.