Nalgonda : జనగణనతో అసెంబ్లీ స్థానాల పెంపు..?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల పెంపుతో పాటు అసెంబ్లీ స్థానాల

Update: 2024-11-02 02:22 GMT

దిశ,నల్గొండ బ్యూరో: దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల పెంపుతో పాటు అసెంబ్లీ స్థానాల పెంపు పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ జనాభా లెక్కల పూర్తి డేటా 2026 నాటికి అందే అవకాశం ఉంది. జనగణన ప్రక్రియ 2026 వరకు పూర్తయితే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య విభజన చట్టం ప్రకారం పెంచడానికి అవకాశం లభిస్తుంది.. విభజన చట్టం ప్రకారం ప్రతి పార్లమెంటు స్థానానికి రెండు అసెంబ్లీ పెరగాల్సి ఉంటుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి రెండు పార్లమెంటు (Parliament) స్థానాలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున మొత్తం ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. భువనగిరి పార్లమెంటు స్థానంలో గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామన్నపేట అసెంబ్లీ స్థానం ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది . రామన్నపేట, ఆత్మకూర్ , మోత్కూర్, వలిగొండ, అడ్డగూడూరు మండలాలను కలుపుతూ అసెంబ్లీ స్థానం ఏర్పాట అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక అసెంబ్లీ (Assembly) స్థానం ఏర్పాటు కావాలంటే 1 లక్ష నుంచి 1.50 లక్షల ఓట్లు ఉంటే నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చు.

అయితే రామన్నపేట కేంద్రంగా ఆ ఐదు మండలాలను కలుపుకుంటే దాదాపు లక్ష యాభై వేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. అంతేగాకుండా పాత నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి నియోజకవర్గం గా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ (Revenue Division) కేంద్రమైన చౌటుప్పల్ కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. చౌటుప్పల్ , నారాయణపురం, పోచంపల్లి , వలిగొండ మండలాలను కలుపుకొని ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే చౌటుప్పల్ కు కచ్చితంగా అవకాశం ఉంటుందని ఇప్పటికే అనేక పార్టీల నేతలు అధికారులు కూడా బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

నల్గొండ పార్లమెంట్ పరిధిలో కూడా రెండు అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. అందులో చాలాకాలంగా చర్చకు వస్తున్న నియోజకవర్గం నల్లగొండ స్థానం పైనే. నల్లగొండ పట్టణంలో దాదాపు లక్షకు పైగా ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లకు నల్లగొండ మండల రూరల్ ఓట్లు కలిపితే ఇవి కూడా నియోజకవర్గానికి సరిపడే ఓట్లు అవుతాయి. అందుకే నల్గొండ టౌన్ (Nalgonda Town)తో పాటు నల్గొండ రూరల్ మండలం కలిపి నియోజకవర్గం కానుందనే చర్చ చాలా కాలంగా ఇక్కడ జరుగుతుంది . దాంతోపాటు కొండ మల్లేపల్లి కేంద్రంగా గుర్రంపోడు, చింతపల్లి, నాంపల్లి ,మర్రిగూడ మండలాలు కలిపి ఏర్పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నాలుగు మండలాలు కూడా కొండమల్లే పల్లికి అత్యంత సమీపంలో ఉంటాయి. ఇదే కాకుండా మాడుగుల పల్లి కేంద్రంగా కూడా నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని... జరుగుతున్న చర్చను కూడా కొట్టిపారేయలేమని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.


Similar News