వివాదంలో నల్లగొండ సీఐ.. యువతి చెయ్యిపట్టి లాక్కెళ్లడంపై తీవ్ర విమర్శలు (వీడియో)

మహిళా దినోత్సవం జరుపుకుని పది రోజులు కాకముందే ఓ యువతికి తీవ్ర అవమానం జరిగింది.

Update: 2023-03-17 11:08 GMT

దిశ, నిఘా బ్యూరో: మహిళా దినోత్సవం జరుపుకుని పది రోజులు కాకముందే ఓ యువతికి తీవ్ర అవమానం జరిగింది. మహిళల రిజర్వేషన్, హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వేధికగా గళమెత్తుతున్న ఈ తరుణంలో కలెక్టరేట్ సాక్షిగా ఓ మహిళా నేత పోలీస్ అధికారి చేతిలో అవమానానికి గురికావడం వివాదస్పదం అయింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీక్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా శుక్రవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏబీవీపీ జిల్లా విభాగం గురువారమే ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉదయం నుంచే కొందరు ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అయినా కొంతమంది కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో మహిళా పోలీసులు ఉన్నా.. సీఐ రాఘవరావు అత్యుత్సాహం ప్రదర్శించారు.ఏబీవీపీ నాయకురాలు హరిత చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ డీసీఎం వాహనంలోకి ఎక్కించారు. ఓవైపు మహిళా కానిస్టేబుల్ ఆమెను తీసుకెళ్తున్నప్పటికీ సీఐ యువతి చేతులు పట్టి లాగడం వివాదస్పదమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఐ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేసు విచారణలోనూ పోలీసులు న్యాయసూత్రాలను పాటించాలని ఎమ్మెల్సీ కవిత న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న ఈ సమయంలో యువతి పట్ల సీఐ ఇలా ప్రవర్తించడం ఏంటని నిలదీస్తున్నారు. సాక్షాత్తు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News