CM Revanth Reddy: కేటీఆర్ తో కేసీఆర్ ను టార్గెట్ చేశాం.. ఇక కేటీఆర్ కోసం హరీశ్ ను వాడుతాం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-29 10:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఉనికి లేకుండా చేయడమే నా టార్గెట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (KTR) తోనే కేసీఆర్ ను మర్చిపోయేలా చేశామని, ఇక హరీశ్ రావు (Harish Rao)ను వాడి కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేస్తామని అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్  (CM media chit chat) నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. బావ బామ్మర్దులను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసని, పోలీసులను పెట్టి నిర్బంధించొచ్చు కానీ అది నా విధానం కాదని ఎలా ప్లాన్ చేయాలో అలా చేస్తామన్నారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు. కేసీఆర్ అనేది ఎక్స్ పైరీ మెడిసిన్ అని బావతో బావమరిది రాజకీయం ముగుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని, విచారణ విషయంలో కక్ష సాధింపు ఉండదన్నారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక ముందడుగు పడిందని ప్రభాకర్ రావు, శ్రవణ్ పాస్ పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్టు అవుతారన్నారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతామన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న నా కల నెరవేరింది. సీఎం పోస్టు కంటే పెద్ద కలలు నాకు వేరే ఏమీ లేవన్నారు.

జన్వాడ పార్టీపై స్పందన..

దీపావళి పండగ అంటే చిచ్చు బుడ్లను చూస్తాం కానీ.. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో సారా బుడ్లను చూడాల్సి వస్తోందన్నారు. రాజ్ పాకాల (Raj Pakala) ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయని అలాంటప్పుడు దాన్ని దీపావళి పార్టీ అని ఎలా అంటారన్నారు. మూసీ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ముందుకే సాగుతామన్నారు. నిర్ణయం తీసుకునే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తామని నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదన్నారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. బాపూ ఘాట్ నుంచి మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభిస్తామన్నారు. నవంబర్ లోపు పూసీ ప్రాజెక్టు (Musi Project) పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విపక్షాలు తమ ప్రతిపాదనలు సూచించవచ్చన్నారు. ఈ అంశంలో త్వరలో అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు మూసీపై తమ అభ్యంతరాలు తెలియజేయాలని వారికి నన్ను కలవడం అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలవొచ్చు అన్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి నీరు తరలిస్తామని ఇందుకు నవంబర్ లో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్ కు పంపుతామన్నారు.

Tags:    

Similar News