ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మళ్లీ తిట్లదండకం..కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్.. ప్రతిఘటించిన కాంగ్రెస్ నాయకులు..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మరోసారి నోరు పారేసుకున్నారు.

Update: 2023-04-22 14:26 GMT

దిశ, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మరోసారి నోరు పారేసుకున్నారు. ఆయన ఇలా మాట్లాడడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రతిఘటించారు. దీంతో సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఇలా తిట్ల దండకం అందుకోవడం ఇది రెండోసారి. అది కూడా ఇదే గానుగుపాడు గ్రామంలో చోటు చేసుకోవడం దురదృష్టకరం. వివరాలు ఇలా ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఆయన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జనగామ మండలం గానుగుపాడు గ్రామానికి వెళ్లారు. మొదట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ సాపీగా కూర్చొని గ్రామస్తులతో ముచ్చటిస్తున్నారు.

ఈ క్రమంలో తమ వరి పొలాలు నీరు అందక ఎండిపోయాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతును తన దగ్గరకు పిలుచుకొని ఎమ్మెల్యే ముచ్చటిస్తూ గతంలో పంట పొలాలకు నీటి సదుపాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ మాట్లాడుతూ బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద పైపులైన్ పగిలిపోయి రిపేర్ చేయడానికి టైం పట్టిందని, దాంతో ఈ సారి పంటలకు నీరు రావడం ఇబ్బందిగా మారిందని ఆయన వారికి చెబుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తిట్ల దండకాన్ని అందుకున్నాడు. ఏకంగా బూతు మాటలు మాట్లాడాడు.

దీంతో గ్రామస్తులు, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు ఎమ్మెల్యే మాటలతో విస్తు పోయారు. అయితే ఆగ్రహించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆయనను గట్టిగానే నిలదీశారు. సభ్యత నేర్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీలను టార్గెట్ గా చేసుకొని, తిట్ల దండకంతో నోరు పారేసుకోవడం ఎమ్మెల్యేకు అలవాటైందని. ఇదేం సంస్కారం అని పలువురు ఎమ్మెల్యేను సభ వేదిక ముందే ప్రశ్నించారు. ఆ సమయంలో వెంట ఉన్న పోలీసులు సైతం ఏమీ అనలేక చోద్యం చూస్తూ,సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు.

ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్, ఐలయ్య, భూపాల్, రాజు తదితరులు ఉన్నారు. ‘సాధ్యమైతే సమస్యలను పరిష్కరించాలి. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇతర పార్టీలపై నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసం, మీరు మాట్లాడినట్లు మేం కూడా బూతులు మాట్లాడగలం. కానీ అది సంస్కారం కాదని ఊరుకుంటున్నాం’ అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే విధి లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీసిన ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం ఏంటి? గౌరవప్రదమైన ఎమ్మెల్యే హోదాలో ఉంటూ నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం సరైంది కాదని పలువురు అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన నోటి దురుసుతనాన్ని తగ్గించుకొని హుందాగా వ్యవహరించాలని వారు తెలిపారు.

Tags:    

Similar News