ప్రతి 10 రోజులకోసారి బీఆర్ఎస్ సర్కార్‌పై ఫైట్ : MP K. Laxman

ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

Update: 2023-07-11 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ప్రతి 10 రోజులకోసారి బీఆర్ఎస్ సర్కార్ పై పోరాడనున్నట్లు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో పార్టీని విస్తరింపజేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. అందుకే ఎన్నికల ఇన్ చార్జీగా ప్రకాష్ జవదేకర్, సహ ఇంఛార్జి గా సునీల్ బన్సల్ ను నియమించిందన్నారు. స్థానిక అంశాల ప్రభావితంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీకే ఓటు వేసేందుకు కర్ణాటక ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, నితీష్ కుమార్, స్టాలిన్ సైతం ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, మరి సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోడీ సైతం లిక్కర్ కుంభకోణం ఢిల్లీకి వరకు పాకిందని మండిపడ్డారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 30శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొడతారని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు వారి అవినీతిని వారే ఒక్కొక్కరుగా బయట పెట్టుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనపై మేధావులను కలిసి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 30 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి బీజేపీపై విశ్వాసం కల్పిస్తామన్నారు. ప్రతి నెలా టిఫిన్ బైఠక్‌ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ అయిన 31 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు లక్ష్మణ్ చెప్పారు. ఈ 31 సెగ్మెంట్లలో సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంచేశారు. కాంగ్రెస్ దూతగా సీఎం కేసీఆర్ ను అఖిలేష్ యాదవ్ కలిశారని, ఇరు పార్టీల మధ్య బంధాన్ని బయటపెడుతామని ఆయన అన్నారు. కొత్త ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి చేరువవుతామని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పై చర్చించి మేనిఫెస్టోలో చేరుస్తామని లక్ష్మణ్ స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని, తమకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మణ్ చెప్పారు.

Tags:    

Similar News