ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను చంపేస్తానంటూ కోమటిరెడ్డి వార్నింగ్.. కలకలం రేపుతోన్న ఆడియో
కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు.
దిశ, నిఘా బ్యూరో: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ నుండి పోటీ చేసిన తన సోదరుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసిన వైనం అందరికీ తెలిసిందే. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం ఆయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన, టీపీసీసీ పైన తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సువాస్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజల్లో తిరిగినా.. నాపై స్టేట్ మెంట్ ఇచ్చినా చెరుకు సుధాకర్ను చంపడంతో పాటు ఆయన కొడుకు హాస్పటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. నాపై స్టేట్మెంట్స్ ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. చెరుకు సుధాకర్ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని నేను ఆపలేనని హెచ్చరించారు.
ఏఐసీసీ దృష్టికి ఆడియో క్లిప్పింగ్..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు సుధాకర్‌పై తీవ్ర అసభ్య పదజాలంతో విరుచుకుబడిన ఆడియో క్లిప్పింగ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నేత అయిన చెరుకు సుధాకర్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలం ఉపయోగించడంపై యావత్ తెలంగాణ ఉద్యమకారులు వెంకట్ రెడ్డి తీరును తప్పుపట్టారు. అంతేగాక సదరు ఆడియో క్లిప్పింగులను, కోమటిరెడ్డి వ్యవహార శైలిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
నకిరేకల్‌పై పట్టు కోల్పోతుండడమే కారణమా..?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొరకరాని కోయగా మారాడు. దాదాపు ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ తన మాట నెగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలంటూ తరచూ మెలికలు పెడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పటివరకు నల్గొండ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసి వచ్చేవారు. కానీ ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
అయితే మునుగోడు ఉపఎన్నిక ముందు వరకు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఉపఎన్నిక సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చెరుకు సుధాకర్‌కు ప్రయారిటీ పెరుగుతుండడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బలపడితే తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోవడం కష్టం అవుతుందని, ఎలాగైనా చెరుకు సుధాకర్‌కు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చెరుకు సుధాకర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతో ఆ ఎత్తులు పనిచేయడం లేదు.
ఈసారైనా చర్యలు తీసుకునేనా..
కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పార్టీ అధిష్టానం పైన, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన ఇప్పటికే పలుమార్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా పార్టీ అధిష్టానం ఏనాడు చర్యలు తీసుకుంది లేదు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ పైన డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించి పార్టీ ప్రతిష్టను ఇబ్బందుల్లో పడేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకుంటుందా లేక నిజంగానే ఆయన అనుచరులు చెబుతున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది.
ఆడియో కోసం ఇక్కడి క్లిక్ చేయండి: