60 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు: MP ఈటల
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల చౌరస్తా సమీపంలో పది ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన దాదాపు 60 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదం
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల చౌరస్తా సమీపంలో పది ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన దాదాపు 60 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగాయని, అందుకోసం అండర్‌పాస్, ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రికి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు.
విజయవాడ నేషనల్ హైవేపై రెండు ఓవర్ బ్రిడ్జీలు, అలాగే ఛత్తీస్ గఢ్ హైవేపై రెండు, కొంపల్లి నుంచి నాగపూర్ హైవేపై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేయాలని రాజేందర్ కోరారు. అంతేకాకుండా ఈ మార్గాల్లో మెట్రో రైలు నిర్మాణం చేయాలనే డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. ఓవర్ బ్రిడ్జి పనులు పలు చోట్ల జరుగుతున్నాయని, కాబట్టి ఈ రెండిటినీ కలిపి కోఆర్డినేట్ చేసుకొని నిర్మాణం చేపడితే తక్కువ ఖర్చు అవుతుందని వివరించారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈటల రాజేందర్ తమను చాలా పనులు చేపట్టాలని అడిగారని గుర్తుచేశారు. అలాగే ఈటల చెప్పిన అంశంపై దృష్టిపెడతామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.