MP Eatala : మోసం చేసిన ఆ పార్టీకి ఓటు వేద్దామా? ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Congress) కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఈటల మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. అడ్రస్ లేని ఫేక్ పేపర్లు, సోషల్ మీడియాలో అనేక రకాల విషప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు చాలా విజ్ఞులు కాబట్టి అలాంటి కుట్రలు, విషయ ప్రచారాలు,ఫేక్ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ధీరుడు ఎప్పుడు బరిగీసి కొట్లాడుతారని, సత్తా లేనివారు మాత్రమే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారని ఫైర్ అయ్యారు.
గత నెల రోజులుగా సీరియస్‌గా (Telangana BJP) బీజేపీ ప్రచారం చేస్తోందని, అందరూ ఇన్వాల్వ్ అయి సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారని తెలిపారు. దీన్ని చూసి ఓర్వలేక, ఎట్లైనా చేసి ఓడగొట్టాలని డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు.. నాయకులను కించపరిచారు.. అంటూ విష ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో 2024- 25 లో నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. స్టార్ట్ అప్‌ల కోసం పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్తుందని, అబద్ధాలాడి కాలం గడుపుతుందని విమర్శించారు. బీజేపీ కమిట్మెంట్‌తో పనిచేస్తుందని తెలిపారు.
టీచర్ల విషయంలో 317 జీవోను, జరిగిన అక్రమాలను సవరిస్తాను చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు సవరించ లేదన్నారు. పెండింగ్‌లో ఐదు డీఏలు, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా 15 నెలలుగా అందడం లేదన్నారు. చివరికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. హెల్త్ కార్డులు ఇతర సమస్యల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదని, మోసం చేసిన పార్టీకి ఓటు వేద్దామా ? అని ప్రశ్నించారు. పోరాటం చేయగలిగిన సత్తా ఉన్న బీజీపీకి ఓటు వేద్దామా ఆలోచించాలని సూచించారు. ఈ సర్కార్ అంకుశం పట్టుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం చేసేలా లేదని, పోరాటం చేసి మీ సమస్యలను పరిష్కరించే బీజేపీకి అండగా ఉండాలని కోరారు.