ఏ ప్రధాని అయినా పిల్లల గురించి ఆలోచించారా..? MP Bandi Sanjay Kumar
గతంలో ఏ ప్రధాని అయినా, లేక ఇతర పార్టీ నేతలు ఎవరైనా పిల్లల గురించి ఏనాడైనా కనీసం ఆలోచించారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో ఏ ప్రధాని అయినా, లేక ఇతర పార్టీ నేతలు ఎవరైనా పిల్లల గురించి ఏనాడైనా కనీసం ఆలోచించారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కానీ, ప్రధాని మోడీ ఆలోచించి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని హిందూ స్కూల్లో నిర్వహించిన పరీక్ష పే చర్చలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడంలో పడే ఇబ్బందులను తొలగించేందుకు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణలో 600 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.
కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ముందుగానే పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ చేసుకుంటున్నాయని.. అందుకే ర్యాంకులు వస్తున్నాయని ఆరోపించారు. అలాంటి నిర్బంధ చదువులు ఎందుకు? అని ప్రశ్నించారు. యాజమాన్యాలు విద్యార్థులకు బయటి ప్రపంచాన్ని చూడనివ్వకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితి ఏర్పడాలని అన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీ పడటం కాదని.. ముందు వారితో వారు పోటీ పడటం అలవర్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా పక్క విద్యార్థులకు ర్యాంకులు వస్తున్నాయని ఒత్తిడి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. మన చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలే తప్పితే.. ర్యాంకుల కోసం కాదు అనే నిజాన్ని తెలుసుకోవాలని అన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు టైం మేనేజ్మెంట్ అలవర్చుకోవాలన్నారు. ఎన్నడూ అలసిపోవద్దని.. ప్రధాని ఇచ్చిన సక్సెస్ మంత్రతో విద్యార్థులు అంతా సక్సెస్ అవ్వాలని అన్నారు. స్మార్ట్, హార్డ్ వర్క్ చేయాలని మోడీ సూచించిన దారిలో నడిచి జ్ఞానిగా, శక్తిగా ఎదగాలని సూచించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వాలని చెప్పారు. అనంతరం పెయింటింగ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొమెంటో అందజేశారు.