మెడికో ప్రీతిది ముమ్మాటికీ హత్యే: రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రీతి తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

Update: 2023-02-27 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రీతి తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రీతి మరణం అత్యంత బాధాకరమని, ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువతి చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు.

ప్రీతి చావుకు కారకుడైన మనిషికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గులేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోందని ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా ఎంతో భవిష్యత్ ఉన్న పసిపిల్లలు, విద్యార్థులు చనిపోవడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని, ఆ యువతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతామని బండి స్పష్టంచేశారు. మేధావులు, విద్యావేత్తలు సహా సభ్యసమాజం వెంటనే ఈ ఘటనపై స్పందించాలని కోరారు. భవిష్యత్తులో ప్రీతిలాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

పార్టీకి సంబంధం లేకుండా.. తెలంగాణలో సునిల్ బన్సల్ సీక్రెట్ ఆపరేషన్! 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..