రూపాయి పంపిస్తే.. అందేది 15 పైసలే: కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ ఫైర్

కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుకు రూపాయి అందాలంటే అందరి చేతులు మారి చివరకు 15 పైసలు వారి చేతికి అందేవని, ఇది స్వయంగా

Update: 2023-05-29 14:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుకు రూపాయి అందాలంటే అందరి చేతులు మారి చివరకు 15 పైసలు వారి చేతికి అందేవని, ఇది స్వయంగా రాజీవ్ గాంధీయే అంగీకరించారని, కానీ నేడు ప్రధాని మోడీ పూర్తి రూపాయి లబ్ధిదారులకు అందేలా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అదీ కాంగ్రెస్ పాలన అని ఆయన విమర్శలు చేశారు.

హైదరాబాద్ డస్పల్లా హోటల్‌లో ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలనపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ సోమవారం మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వచ్చిన అర్జున్ రామ్ మేఘవాలాను బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని తెలిసే డీబీటీ విధానంతో అవినీతికి తావులేకుండా లబ్ధిదారుడికి ఫలాలు అందజేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కిందని కొనియాడారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళ్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా మోడీ పెట్టుకున్నారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ‘గరీబీ హఠావో’ నినాదం మంచిదేనని, ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందజేత సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలుచేస్తోందన్నారు.

Tags:    

Similar News