జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్.. గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలి: MP బడుగుల లింగయ్య
రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని తలసానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని తలసానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హెచ్చరించారు. బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు రేవంత్ మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. గొల్ల కురుమలను రేవంత్ రెడ్డి అవమానపరిచడాన్ని ఖండిస్తున్నామన్నారు.
గొల్లకురుమలు నీతి నిజాయతీగా బతుకుతాయని, అందరి తలలో నాలుకలా ఉండే జాతులు అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో కూడా కుల దూరహంకారంతో మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూతనందిస్తే రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడన్నారు. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్.. గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు మానుకోవాలని, లేకుంటే గొల్ల కుర్మ లతో పాటు బడుగు, బలహీన వర్గాలు సైతం తగిన శాస్త్రి చెబుతాయన్నారు.
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం రేవంత్ ప్రవృత్తి అని, శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని మండి పడ్డారు. రేవంత్ తక్షణమే గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ యాదవ్‌తో రేవంత్‌కు పోలిక ఎక్కడిదన్నారు. రేవంత్‌కు సంస్కారం లేదన్నారు.
గతంలోనూ గొల్లకుర్మలు రేవంత్ రెడ్డి ఓడించారని, వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఆయన్ను ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 18శాతం గొల్లకురుమలు ఉన్నారని, నీ సంగతి చూస్తామని హెచ్చరించారు. ముందు తన పార్టీ నేతల విమర్శలపై రేవంత్ సమాధానం చెప్పాలని, శ్రీనివాస యాదవ్‌పై విమర్శలు చేయడం కాదన్నారు. రేవంత్ తన దూరహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.