కేసీఆర్‌ను అలా బెదిరించాలి.. అప్పుడే బిల్లులు రిలీజ్ అవుతాయ్: MP అర్వింద్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా బెదిరించాలని, రాష్ట్రంలో రాజకీయ మనుగడ కష్టమనే స్థితికి తీసుకొస్తే తప్పితే ఆయన పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయరని
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా బెదిరించాలని, రాష్ట్రంలో రాజకీయ మనుగడ కష్టమనే స్థితికి తీసుకొస్తే తప్పితే ఆయన పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. అంత జెన్యూన్‌గా ఉన్న సమస్యలను కేసీఆర్ సర్కార్ ఎందుకు పరిష్కరించడంలేదని ఆయన ప్రశ్నించారు. అప్పు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టి సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వడంలేదు, అప్పు తెచ్చి చేపడితే బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ డబ్బులివ్వాలంటే ఆయన్ను రాజకీయంగానే బెదిరించాలని, గ్రామ స్థాయి నుంచి రాజకీయ మనుగడ కష్టమనే పరిస్థితికి తీసుకొస్తేనే ఆయన డబ్బులు చెల్లిస్తారని తెలిపారు. ఇలా సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ఆయన అన్నారు. అందరూ పొలిటికల్‌గా రివోల్ట్ అయితేనే కేసీఆర్ దారికి వస్తాడని, ఇది సర్పంచ్‌లకు తానిచ్చే సలహాగా చెప్పుకొచ్చారు. లేదంటే దున్నపోతు మీద నీళ్లు పడినట్లే కేసీఆర్ పరిస్థితి ఉంటుందని విమర్శించారు.