Moosi project : మూసీ గేట్లు ఓపెన్.. వరదలో చిక్కుకున్న కూలీలు

ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసీ ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడంలో దిగువ ప్రాంతంలో ఉన్న కూలీలు వరదలో చిక్కుకుపోయారు.

Update: 2024-09-22 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అధికారుల నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో కూలీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసీ ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడంలో దిగువ ప్రాంతంలో ఉన్న కూలీలు వరదలో చిక్కుకుపోయారు. నల్లగొండ జిల్లా భీమారంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, మూసీ ఎగువ ప్రాంతాల్లో కురిస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూసీ ప్రాజెక్టు అధికారులు కేవలం సైరన్ మాత్రమే మోగించి మూడు గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఇది తెలియని మూసీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల పశువుల కాపరులు మేతకు, ఇసుక వ్యాపారులు మూసీ వాగులో ఇసుక తీసేందుకు వెళ్లారు. గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా వచ్చిన వరద మూసీ వాగులో ఉన్న వారిని చుట్టుముట్టింది. కేతపల్లి మండలం భీమారం సమీపంలో మూసీ వాగులో పశువులను మేపుతున్న కాపరులు, ఇసుకను ట్రాక్టర్లలో లోడు చేసేందుకు వచ్చిన కూలీలు వరదలో చిక్కుకున్నారు.

ఈ ఘటనలో 20 పశువులు నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అలాగే పశువుల కాపరులతోపాటు కూలీలు వరదలో చిక్కుకున్నారు. వరద ఉధృతిని చూసి వాగు మధ్యలో ఉన్న పెద్దబండ రాయిని ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నల్లగొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి స్పందించి వెంటనే కేతపల్లి పోలీసులకు సంఘటన స్థలానికి పంపించారు. అలాగే మూసీ ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి నీటి విడుదలను తగ్గించారు. పోలీసులు జేసీబీ సాయంతో వరదలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇసుక కోసం వచ్చిన ట్రాక్టర్ సైతం వరదలో మునిగిపోయింది. ప్రస్తుతం నీటి మధ్యలో భీమారానికి చెందిన గంగయ్య, బాలయ్య ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులతో కలిసి పోలీసులు ప్రొక్లెయినర్‌తో వారిని ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


Similar News