మూసీ వెంట 50 మీటర్ల భూమి కావలె.. ప్లీజ్ ఇస్తారా..?
మూసీ బ్యూటిఫికేషన్ వివాదంగా మారుతోంది..
దిశ, హైదరాబాద్ బ్యూరో: మూసీ బ్యూటిఫికేషన్ వివాదంగా మారుతోంది. రాబోయే మూడేళ్లలో గ్రేటర్ పరిధిలో సుమారు 55 కిలో మీటర్ల మేర మూసీ ఆక్రమణలతో పాటు 50 మీటర్ల పరిధిలోని ఆస్తులను తొలగించి సుందరీకరణ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎం ఆర్డీసీఎల్) సంబంధిత ప్రక్రియను స్పీడప్ చేసింది. మూసీ పరివాహక ప్రాంతాలలో నదిని అనుసరించి 50 మీటర్ల పరిధిలో బఫర్‌జోన్‌గా గుర్తించి ప్రైవేట్ ఆస్తుల వివరాలు సేకరించే పనులను మొదలు పెట్టింది. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ మొదటి దశలో ఉస్మాన్ సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్‌సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ నుంచి బాపూఘాట్ వరకు విస్తరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నది చుట్టూ ఉన్న వారసత్వ కట్ట డాల పరిరక్షణ, పునరుద్ధరణ చేయడంతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూడాలని ప్రభుత్వం ముందుగానే అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారికి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురౌతుండగా వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
బీఆర్ఎస్ హయాంలోనే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మూసీ సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు ఏడువేల డబుల్ బెడ్ ఇండ్లను పంపిణీ చేయకుండా ఆపి ఉంచారు. ఇంతలో ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఈ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ బ్యూటిఫికేషన్ చేసేందుకు గాను క్షేత్రస్థాయిలో ఆస్తుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఫీల్డ్ విజిట్ చేస్తున్న అధికారులకు ప్రజల నుంచి ప్రతిఘటనలు ఎదురౌతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అధికారులతో ఘర్షణలకు దిగుతున్నారు.
క్లిష్టంగా ప్రైవేట్ ఆస్తుల సేకరణ..?
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 55 కిలో మీటర్ల మేర పారు తున్న మూసీ నది పరివాహక ప్రాంతాలను జోన్ల వారిగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధుల సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే బ్యూటిఫికేషన్‌లో భాగంగా సేకరిస్తున్న ఆస్తులలో చాలా వరకు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి ఉన్నాయి. వీటిల్లో బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్లు, భవనాలు, ఇతర కట్టడాలు ఉన్నాయి. అయితే వీటిని ఖాళీ చేయించడం తలనొప్పిని తెప్పిస్తోంది. ఆస్తుల సేకరణ వివరాల కోసం వస్తున్న అధికారులకు స్థానికుల నుంచి ప్రతిఘటనలు ఎదురౌతున్నాయి. ఇలా మూసీ వెంట సుమారు 10 వేలకు పైగా కట్టడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించగా వారి నుంచి ఆస్తుల సేకరణకు మార్గాలకు అన్వేషిస్తోంది. భూ సేకరణ చట్టం కింద ఇలాంటి వారికి పరిహారం చెల్లించడంతో పాటు ఇతర మా ర్గాలను వెతుకుతోంది. ఇంతవరకు భాగానే ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తమ ఆస్తులను అప్పగించేందుకు ముందుకు రాకపోగా ఆందోళనలకు దారితీస్తున్నారు. ప్రజలు ప్రాంతాల వారిగా ఏకమై కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిసింది.
బీఆర్ఎస్ సంఘీభావం..
గతంలో అధికారంలో ఉన్న సమయంలో మూసీ వెంట ఉన్న ఆస్తుల సేకరణకు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో పేదల ఆస్తులను కొల్లగొట్టేందుకు చూస్తోందని ఆరోపిస్తూ వారితో కలిసి ఆందోళనలకు తెరతీసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇటీవల కొంత మంది మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఎక్కడిక్కడ ఆందోళనలు మొదలు కావడంతో మూసీ వెంట ఉన్న ఆస్తుల సేకరణ అంతసులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.