మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం

మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కలకలం రేపింది

Update: 2024-10-11 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో కోతి కళేబరం బయటపడింది. వారం రోజులుగా అదే నీటిని స్థానికంగా సరఫరా చేశారు. గ్రామస్తులకు నీరు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్ ను పరిశీలించారు. వెంటనే సిబ్బంది కోతి కళేబరాన్ని సిబ్బంది తొలగించి ట్యాంకును శుభ్రం చేశారు. అయితే కోతి కళేబరం ఉన్న నీటిని తాగిన గ్రామస్తులు తమకు ఎలాంటి రోగాలు సోకుతాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. కలుషిత నీటిని సరఫరా చేసిన అధికారులపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

కోతులు నీటీ కోసం ప్రయత్నించినప్పుడో లేక పరస్పరం కీచులాడుకునే సందర్భంలోనో ఓ కోతి ట్యాంకులో పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సిబ్బంది ట్యాంకుకు మూత పెట్టారా లేదా అన్నది తేలాల్సివుంది. గతంలో నాగార్జున సాగర్, నల్లగొండలలో సైతం ఇదే తరహాలో మంచినీటీ ట్యాంకుల్లో కోతుల కళేబరాలు ఆలస్యంగా గుర్తించడం విమర్శలకు దారితీసింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడకుండా మంచినీటి ట్యాంకులను తరుచు పరిశీలించి శుభ్రం చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Similar News