ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానిదే: MP లక్ష్మణ్
కార్యవర్గంలో మహిళా రిజర్వేషన్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నారీ శక్తి వందన్ చట్టం, మహిళా
దిశ, తెలంగాణ బ్యూరో: కార్యవర్గంలో మహిళా రిజర్వేషన్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నారీ శక్తి వందన్ చట్టం, మహిళా సాధికారత దిశగా అపూర్వమైన అడుగని ఆయన కొనియాడారు. మహిళా సాధికారతకు ప్రధాని మోడీ ఎల్లవేళలా అండగా ఉంటారని, 9 ఏండ్ల పాలనలో మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అందించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద ఇప్పటివరకు రూ.10 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మోడీ ప్రభుత్వం మహిళలకు పొగ నుంచి విముక్తి కల్పించిందన్నారు. ఈ ఏడాది మరో 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించిందన్నారు.
మహిళల లింగ నిష్పత్తి గురించి ఆందోళన చెందుతున్న ప్రధాని మోడీ బేటీ బచావో, బేటీ పడావో నినాదాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ‘సురక్షిత్ మాతృత్వ ఆశ్వాస్ సుమన్ యోజన’ కింద గర్భిణులు, నవజాత శిశువుల జీవిత భద్రత కోసం మోడీ ప్రభుత్వం ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తోందన్నారు. ‘ఉచిత కుట్టు యంత్రం పథకం’ కింద ప్రతి రాష్ట్రంలో.. కుట్టు మిషన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మహిళా శక్తి కేంద్ర యోజన’, ‘సుకన్య సమృద్ధి యోజన’ మహిళల జీవితాల్లో అపూర్వమైన మార్పులను తీసుకొచ్చిందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు. అన్ని వర్గాలకు చెందిన మహిళలకు ‘నిర్భయ్ యోజన’ను కూడా అందజేసిందన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ చట్టంలో జాగ్రత్తలు తీసుకున్నామని, జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత 15 సంవత్సరాల వరకు ఈ మహిళా రిజర్వేషన్ విధానం అమలులో ఉంటుందని ఆయన అన్నారు. ఆ తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలు, ఎంపీలకు డాక్టర్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.