MLC కవిత నేతృత్వంలో 'భారత్ జాగృతి ఫౌండేషన్'.. పెట్టుబడి లక్ష.. విరాళాలు కోట్లలో!

భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ రూపు మార్చుకుంటుందని తెలంగాణ జాగృతికి ఏడేండ్ల ముందే తెలుసా? అందుకే ఆ సంస్థ భారత్​జాగృతి ఫౌండేషన్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిందా? నిజానికి ఇవి సారూప్యత ఉన్న అంశాలు కాకపోయినా.. నిశితంగా ఆలోచిస్తే మాత్రం అవుననే సమాధానమే వస్తుంది.

Update: 2022-11-22 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ రూపు మార్చుకుంటుందని తెలంగాణ జాగృతికి ఏడేండ్ల ముందే తెలుసా? అందుకే ఆ సంస్థ భారత్​జాగృతి ఫౌండేషన్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిందా? నిజానికి ఇవి సారూప్యత ఉన్న అంశాలు కాకపోయినా.. నిశితంగా ఆలోచిస్తే మాత్రం అవుననే సమాధానమే వస్తుంది. 2015 నవంబర్​.. అంటే సరిగ్గా ఏడేండ్ల క్రితం తెలంగాణ జాగృతి అనే ఎన్జీవో సంస్థకు అదనంగా భారత్ జాగృతి ఫౌండేషన్ పేరుతో కల్వకుంట్ల కవిత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ జాగృతి పూర్తిగా సాంస్కృతిక కార్యకలాపాలతో ఉనికిలోకి వస్తే భారత్ జాగృతి ఫౌండేషన్ మాత్రం వివిధ రకాల చారిటీ సర్వీసులను అందించే లక్ష్యంతో తెరపైకి వచ్చింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ డైరెక్టర్లుగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు.

తెలిసింది అప్పుడే..

సాహితీ రంగంలో విశేష కృషి చేసి సమాజాన్ని జాగృతం చేసే రచయితలు, కవులు తదితరులకు వచ్చే ఏడాది నుంచి పురస్కారాలను అందజేస్తామని ఢిల్లీ వేదికగా రెండు రోజుల క్రితం కవిత ప్రకటించారు. ఇండియాటుడే సంస్థ సహకారంతో భారత్ జాగృతి ఫౌండేషన్ ఈ అవార్డులను ఇస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకూ భారత్ జాగృతి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించిన విషయంగానీ, దానికి భార్యాభర్తలిద్దరూ డైరెక్టర్లుగా ఉన్నదిగానీ తెలంగాణ సమాజానికి పెద్దగా పాపులర్ కాలేదు. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి ఫౌండేషన్ లక్ష్యాలు వేరువేరైనా ఈ రెండింటికీ వీరిద్దరే నిర్వాహకులు కావడం గమనార్హం.

లక్ష నుంచి కోట్లలోకి

భారత్ జాగృతి ఫౌండేషన్ పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేవలం రూ.లక్ష కాపిటల్ షేరుతో 2015 నవంబరులో ఏర్పాటైంది. కల్వకుంట్ల కవిత 90% షేర్లతో, భర్త అనిల్‌కు 10% షేర్లతో ఇద్దరే డైరెక్టర్లుగా హైదరాబాద్‌లోని దోమల్‌గూడ అడ్రస్‌తో రిజిస్టర్ అయింది. ఒక్కో షేర్ విలువ రూ. 10గా ఫిక్స్ చేయడంతో కవిత షేర్ రూ. 90,000, భర్త అనిల్ వాటా రూ. 10,000గా ఉన్నది. దోమల్‌గూడలోని పాశం అమృతరామ్ రెసిడెన్సీలోని ఫ్లాట్ 301 నుంచి నడిచే ఈ ఫౌండేషన్ నెలకు రూ. 40 వేల అద్దె చొప్పున లీజు ఒప్పందం కుదుర్చుకున్నది. పెద్దగా చారిటీ సేవలేవీ నిర్వహించకపోయినా 2019లో ఒక్కసారిగా రూ. 1.92 కోట్ల (రూ. 1,92,82,144) మేర విరాళాలు అందాయి. దీంతో 2019 మార్చి చివరి నాటికి కంపెనీ ఖర్చులన్నీ పోగా రూ. 1.59 కోట్ల ఆస్తులను నమోదు చేసుకున్నది.

అయితే, ఆ మరుసటి సంవత్సరం (2020)లో రూ. 5.80 లక్షలు మాత్రమే డొనేషన్లు వచ్చాయి. ఖర్చు మాత్రం ఒక్కసారిగా రూ. 1.36 కోట్ల మేర చూపించడంతో ఆ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 1.33 కోట్ల నష్టంతో నడుస్తున్నట్లు ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టుల ద్వారా వెల్లడైంది. ఆఖరుకు రూ. 50.08 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొన్నది. కొత్తలో నెలవారీ నిర్వహణ ఖర్చులు గరిష్టంగా రూ. 70 వేలు దాటకపోయినా 2019లో అది రూ. 1.2 లక్షలకు, 2020లో రూ. 5.05 లక్షలకు చేరుకున్నది. పూర్తిగా సేవా దృక్పథంతోనే విరాళాలను సేకరించడం, వాటిని ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని భారత్ జాగృతి పేర్కొంటున్నది. ఏవైనా లాభాలు వచ్చినా సంస్థలో పనిచేసేవారికి బోనస్, డివిడెండ్ తదితర రూపాల్లో మళ్లించకుండా స్పష్టంగా నిర్దేశించుకున్నది. తెలంగాణ జాగృతి సంస్థకు ఆడిటర్‌గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబు (గోరంట్ల అండ్ కో) భారత్ జాగృతి ఫౌండేషన్‌ లెక్కలు కూడా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ నిమిత్తం ఇటీవల ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.

కుటుంబ సంస్థలుగా 'జాగృతి'

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో సాంస్కృతిక రంగానికి పరిమితమవుతూ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి ఒక ఎన్జీవో సంస్థగా ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రం 2014లో ఏర్పాటుకావడంతో ఆ మరుసటి సంవత్సరం చివర్లో భారత్ జాగృతి ఫౌండేషన్ ఒక కార్పొరేట్ (ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీగా ఆవిర్భవించింది. ఈ రెండూ వేర్వేరుగా పనిచేస్తున్నా కవిత, భర్త అనిల్ మాత్రమే వీటి వ్యవహారాలను చూసుకుంటున్నారు. కుటుంబ సంస్థలుగానే నడుస్తున్నాయి. భారత్ జాగృతి ఫౌండేషన్ అద్దెకు తీసుకున్న దోమల్‌గూడలోని పాశం అమృతరామ్ బిల్డింగ్‌లోని 301 ఫ్లాట్ రాజీవ్ సాగర్ పేరుతో లీజు ఒప్పందం కుదర్చుకున్నది. సుదీర్ఘకాలం పాటు కవితకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాజీవ్‌సాగర్ ప్రస్తుతం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

భారత్ జాగృతి లక్ష్యమేంటి?

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని రిజిస్టర్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు డైరెక్టర్లుగా కవిత, ఆమె భర్త అనిల్ దీని ఫంక్షనింగ్ కోసం నిర్దిష్టమైన ఉద్దేశాలను రూపొందించారు. ఆధునిక, సంప్రదాయ వైద్య విధానాల్లో ఆస్పత్రులు, క్లినిక్‌లు, డిస్పెన్సరీలు, మెడికల్ లేబొరేటరీలు, పరిశోధనా యూనిట్లు నెలకొల్పడానికి, నిర్వహించడానికి, మెరుగుపర్చడానికి, విస్తరించడానికి, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి ఈ సంస్థ తోడ్పడనున్నది. వీటికి తోడు విద్యా రంగంలో అగ్రికల్చర్, ఆర్ట్స్ మొదలు మెడిసిన్, ఇంజనీరింగ్ వరకు వివిధ స్థాయిల్లో తగిన ప్రోత్సహకాలనుక ల్పించి నిరక్షరాస్యతను నిర్మూలించడం, విద్యకు దూరమైనవారికి ఆ అవసరాన్ని తీర్చడం లాంటివి కూడా ఈ సంస్థ లక్ష్యాలు కావడం విశేషం.


Similar News