స్పందించకపోతే మేమే గేట్లు బద్దలుకొట్టుకొని వెళ్తాం.. MLC కవిత సంచలన ప్రకటన

ఎస్సీ వర్గీకరణ(SC Classification)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు.

Update: 2025-02-20 11:25 GMT
స్పందించకపోతే మేమే గేట్లు బద్దలుకొట్టుకొని వెళ్తాం.. MLC కవిత సంచలన ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ(SC Classification)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో దళితబంధు(Dalit Bandhu) సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో ప్రధాని మోడీ(PM Modi), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇద్దరి పాత్ర శూన్యమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని చెప్పారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు.. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని ఆరోపించారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారని మండిపడ్డారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంగా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని విమర్శించారు.

దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. ఏడాదిలోనే అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. అవాకులు, చెవాకులు పేలటం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులు ఇచ్చి చూపించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలన్నారు. ఎస్సీలకు గత బడ్జెట్‌లో 33 వేల కోట్లు కేటాయించి.. కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం లేని ప్రభుత్వం అని విమర్శించారు.

అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanthi), వర్దంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండలు కూడా వేయడం లేదని అన్నారు. అంబేద్కర్‌ను, ఆయన వారసులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని సీరియస్ అయ్యారు. అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి.. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్‌ను గౌరవించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది.. అందుకే అంబేద్కర్‌పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News