పోలీసులు అతిగా ప్రవర్తించొద్దు.. CPI ఎమ్మెల్యే కూనంనేని హెచ్చరిక
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న హెచ్ సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని సీపీఐ
దిశ, తెలంగాణ బ్యూరో: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న హెచ్ సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి, అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. అవి హెచ్ సీయూ భూములని విద్యార్థులు అంటుండగా, అవి రాష్ట్ర ప్రభుత్వానివేనని ప్రభుత్వం అంటుందని, దీనిపై సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించి, వారి అభిప్రాయాలను స్వీకరించాలన్నారు.
400 ఎకరాలకు బదులుగా, వర్సిటీకి అంతే మొత్తంలో భూములు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు చూపిస్తున్నా, వర్సిటీ విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండిస్తున్నామన్నారు. భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఇలాంటి ఆందోళనలను తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించడం మంచిదన్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడితే మంచి సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని, ఇలాంటి సున్నితమైన అంశాలు విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించొద్దని సూచించారు. విద్యార్థులక సహజంగానే ఆందోళన ఉంటుందని, దానిని అర్థం చేసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.