హైదరాబాద్‌లో అటవీ భూముల నరికివేత.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో అటవీ భూముల నరికివేతపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Update: 2025-04-01 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని ఈభూములను వేలం వేయడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని, వట ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్ధ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. ఆ భూములను డిఫాల్ట రైజేషన్​ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అంటూ నిలదీశారు. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకు పోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు.


కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి నిధులివ్వాలి:

ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర క్రీడాల వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కోరారు. తెలంగాణలోని అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన కరీంనగర్ విద్య, క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందులో భాగంగా కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలతోపాటు ఇతర విద్యాసంస్థలున్నాయి. ముఖ్యంగా క్రీడల్లో కరీంనగర్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్జున అవార్డు గ్రహీత మడాసు శ్రీనివాసరావు కరీంనగర్‌కు చెందినవారే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖేలో ఇండియా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి తగిన నిధులు ఇవ్వాలని కోరారు. స్టేడియం అభివృద్ధిలో భాగంగా 8-లేన్ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ తో మట్టి ట్రాక్ స్థానంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. అథ్లెట్లు రాత్రి వేళల్లో కూడా సాధన చేసేందుకు ఫ్లడ్ లైట్లను, దీంతోపాటు పోటీలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ఓపెన్ గ్యాలరీ(10)ల్లో క్రీడాకారులు, ప్రేక్షకులకు రక్షణ లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నందున గ్యాలరీలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కరీంనగర్ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసి దేశానికి గౌరవం తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

శాతవాహన వర్శిటీకి లా కళాశాల మంజూరు చేయాలి :

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో న్యాయ కళాశాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​కోరారు. శాతవాహన వర్శిటీ పరిధిలో వచ్చే విద్యా సంవత్సరానికి 120 మందితో (రెండు సెక్షన్లతో కలిపి) లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో విజ్ఝప్తి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్చువల్ ద్వారా తనిఖీ నిర్వహించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణలతో కూడిన నివేదిక కోరిందని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపామని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల లా కోర్సుకు అనుమతి ఇవ్వాలన్నారు. వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అందుకు అనుగుణంగా శాతవాహన వర్శిటీకి అనుబంధంగా సాధ్యమైనంత తొందర లోనే లా కాలేజీకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి లా కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.

Similar News