MLC Kavitha ఇంటివద్ద CBI.. చార్జిషీట్‌లోని వివరాలపై ప్రశ్నల వర్షం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు ఉన్న ప్రమేయంపై దర్యాప్తు క్రమంలో వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోడానికి

Update: 2022-12-11 06:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు ఉన్న ప్రమేయంపై దర్యాప్తు క్రమంలో వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోడానికి సీబీఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆదివారం ఉదయం ఆమె నివాసానికి చేరుకున్నది. డీఐజీ రాఘవేంద్ర శ్రీవత్స నేతృత్వంలోని ఆరుగురితో కూడిన బృందం నిర్దిష్ట సమయానికి పది నిమిషాల ముందే చేరుకున్నది. ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. రెండు కార్ల (ఏపీ-27-ఏపీ-3344, ఏపీ-09-బీవై-0450)లో వచ్చిన సీబీఐ అధికారులు ఆమె నివాసంలోనే విడిగా ఒక గదిలో ఆమె నుంచి వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం విచారణ అనంతరం ఆమె నుంచి న్యాయవాది సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. సీబీఐ టీమ్ రావడానికి ముందే కవితకు లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి నిపుణులు వేరే కారులో చేరుకున్నారు.

కవితను ప్రశ్నించడానికి సీబీఐ టీమ్ రావడానికి ముందే బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఆమె నివాసం ఉన్న గల్లీలోకి ఇతర వాహనాలేవీ రాకుండా అన్ని వైపులా ఉదయం నుంచే బారికేడ్లను ఏర్పాటుచేశారు. పార్టీ శ్రేణులు రావద్దంటూ ముందుగానే సమాచారం ఇవ్వడంతో నినాదాలు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దర్యాప్తు జరగనున్న విషయం ఖరారు కావడంతో శనివారం రాత్రికే ప్రగతి భవన్ వెళ్ళిన కవిత దీనికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తొలుత ఈ నెల 6న విచారించాలని సీబీఐ నోటీసు జారీచేయడంతోనే లీగల్ నిపుణుల నుంచి కవిత అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ కారణాలతో ఆ విచారణ 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు వాయిదా పడింది.

ఆ ప్రకారమే ఢిల్లీకి చెందిన సీబీఐ ఇన్వెస్టగేషన్ టీమ్ శనివారం రాత్రికే నగరానికి చేరుకుని గెస్ట్ హౌజ్‌లో బస చేసినట్లు స్థానిక జోనల్ అధికారుల సమాచారం. ఈ టీమ్ కవిత నివాసానికి చేరుకోడానికి ముందే ఆమె తరఫు లీగల్ నిపుణులు, న్యాయవాది అక్కడకు చేరుకున్నారు. సీబీఐ టీమ్ కవితను ఒంటరిగానే ప్రశ్నించినా ఆ తర్వాత ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను మాత్రం న్యాయవాది సమక్షంలోనే తీసుకోనున్నది. దీన్ని సీబీఐ అధికారులు వీడియో రూపంలోనూ రికార్డు చేయనున్నారు. సీబీఐ విచారణను పురస్కరించుకుని రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం చుట్టుపక్కర దాదాపు ఇరవై మంది మోహరించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు  కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 'సౌత్ గ్రూపు' పేరుతో కల్వకుంట్ల కవితతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి జోక్యం చేసుకున్నారని సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఆరోపించింది. కుంభకోణంమీద సీబీఐ ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రెండు నెలల పాటు దర్యాప్తు చేసి పది వేల పేజీలతో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. స్పెషల్ కోర్టు జడ్జి సమక్షంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించిన అంశాలను ఇప్పుడు కవితను విచారించే సందర్భంగా ఆధారాలతో సహా సీబీఐ అధికారులు ప్రస్తావించే అవకాశం ఉన్నది.

లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలు కాకపోయినప్పటికీ ఆమెకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఇప్పటికే సీబీఐ విచారించింది. పలువురిని అరెస్టు చేసి వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్న తర్వాత కవితకు ప్రమేయం ఉన్నట్లుగా అనుమానించిన సీబీఐ సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 ప్రకారం ఒక సాక్షిగా ఆమెను ప్రశ్నించడానికి ఈ నెల 2వ తేదీన తొలుత నోటీసులు జారీచేశారు. కానీ ఎఫ్ఐఆర్, ఫిర్యాదు ప్రతిని ఇవ్వాలంటూ కవిత కోరడం, ఆ తర్వాత సీబీఐ నుంచి మెయిల్ ద్వారా అవి అందడం, అందులో తన పేరు లేదనే కారణాన్ని చూపి 6వ తేదీన అందుబాటులో ఉండనని చెప్పి 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా రావచ్చంటూ ప్రత్యామ్నాయ డేట్‌లను సూచించారు. ఆ ప్రకారం 11వ తేదీని సీబీఐ ఫిక్స్ చేసి విచారణ కోసం ఆమె నివాసానికి చేరుకున్నది.

విచారణలో కేవలం సీబీఐ చార్జిషీట్‌తో పాటు దర్యాప్తులో పలువురు నిందితులు, సాక్షులు చెప్పిన వివరాల గురించి మాత్రమే కవితను ప్రశ్నిస్తుందా లేక ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలతో పాటు అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని వివరాలపై కూడా ఆరా తీస్తారా అనేది సాయంత్రం తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉన్నది.

Read More....

అపోలో హాస్పిటల్‌‌లో దీక్ష కొనసాగిస్తున్న షర్మిల 

Tags:    

Similar News